ప్రచారంలో అపశ్రుతి... అస్వస్థతతో ఆసుపత్రి పాలైన పయ్యావుల కేశవ్

26-03-2019 Tue 16:07
  • వడదెబ్బకు గురైన టీడీపీ నేత
  • ప్రచారానికి బ్రేక్
  • చేనేత కుటుంబాలతో మాట్లాడుతుండగా ఘటన
తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. మండు వేసవిలో ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన ఆయన వడదెబ్బకు గురయ్యారు. తన నియోజకవర్గంలో చేనేత కుటుంబాలను కలిసి మాట్లాడుతున్న పయ్యావుల ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. ఇది గమనించిన స్థానికులు పయ్యావులను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన కేశవ్ ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి విప్ గా ఎదిగారు. ప్రస్తుతం మరోసారి అసెంబ్లీ బరిలో దిగిన ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి నుంచి పయ్యావులకు గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు.