Chandrababu: కేసీఆర్ ను చూస్తే భయం... ఉచ్చలు పోసుకుంటాడు: జగన్ పై సెటైర్లు వేసిన చంద్రబాబు

  • కేసీఆర్ కాళ్ల దగ్గర కాపలా కాస్తున్నాడు
  • నీకు పుట్టిన గడ్డపై ఏమన్నా అభిమానం ఉందా?
  • కడప రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగం

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కడప రోడ్ షోలో జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మద్దతిస్తే తప్పేంటి అని జగన్ అడుగుతున్నారని, కేసీఆర్ కు సపోర్ట్ చేయడం తప్పే, తప్పున్నర కూడా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవరైనా కేసీఆర్ కు మద్దతిస్తే ఖబడ్దార్ అంటూ పరోక్షంగా జగన్ కు హెచ్చరికలు జారీచేశారు. అలాంటివాళ్లు రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని చంద్రబాబు స్పష్టం చేశారు.

"మనమేమన్నా దొంగలమా, ఎన్ని తిట్టారు మనల్ని, 60 ఏళ్ల చాకిరీ చేస్తే అవమానించి పంపించారు. కట్టుబట్టలతో పంపారు. లక్ష కోట్ల రూపాయలు మన ఆస్తుల్లో వాటా రావాల్సి ఉన్నా ఈ జగన్ ఎందుకు ఇప్పించడు?" అంటూ నిలదీశారు. జగన్ నీకు సిగ్గేమైనా ఉంటే, పుట్టిన స్థలంపై అభిమానం ఏమైనా ఉంటే ఎలా కేసీఆర్ ను సపోర్ట్ చేస్తావ్? అంటూ ప్రశ్నించారు.

రాయలసీమకు నీళ్లొచ్చే పథకాలకు అడ్డుతగులుతున్న కేసీఆర్ కు మద్దతిస్తావా? రాయలసీమ రాళ్లసీమగా మారిపోవాలా? అసలు, ఇలాంటివాళ్లను నేను లెక్కలోకి తీసుకోను, ఎవరెన్ని చేసినా రాయలసీమను రతనాల సీమగా మార్చుతానంటూ హామీ ఇచ్చారు. "కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని ఎదిరించి మేమే ఇక్కడ ప్రారంభోత్సవం జరిపాం. కానీ జగన్ కు భయం, కేసీఆర్ ను చూస్తే ఉచ్చలు పోసుకుంటాడు. మీరు జగన్ మాటలు వింటే బాంచన్ నీ కాల్మొక్తా అంటూ కేసీఆర్ కాళ్ల వద్ద కాపలా కాయడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది. మనకు ఆ ఖర్మ పట్టలేదు. ఆత్మగౌరవం ఉంది. కానీ, జగన్ కేసుల భయంతో మోదీ సంకలో కూర్చున్నారు. రాష్ట్ర గౌరవాన్ని కేసీఆర్ కు తాకట్టుపెట్టారు" అంటూ చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు.

More Telugu News