Ravichandran Ashwin: నిన్నటి నుంచి మారు మోగుతున్న 'మన్కడింగ్'... ఆ పేరు వెనకున్న ఆసక్తికర కథ!

  • జోస్ బట్లర్ ను మన్కడింగ్ అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్
  • తొలిసారిగా ఆసీస్ ఆటగాడిని అవుట్ చేసిన వినూ మన్కడ్
  • ఆయన పేరు మీదుగానే 'మన్కడింగ్' అవుట్

జోస్ బట్లర్ ను రవిచంద్రన్ అశ్విన్ 'మన్కడింగ్' అవుట్ చేశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నిన్నటి నుంచి అశ్విన్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ 'మన్కడింగ్' అవుట్, దానికి ఆ పేరు పెట్టేందుకు దారితీసిన ఘటన వెనుక ఆసక్తికర కథ ఉంది.

వాస్తవానికి క్రికెట్ నిబంధనల ప్రకారం, బౌలర్ బంతి వేయకముందు నాన్ స్ట్రయికర్ గా ఉన్న ఆటగాడు క్రీజ్ దాటితే, బౌలర్ బెయిల్స్ ను పడేయడం ద్వారా అవుట్ చేయవచ్చు. ఈ విధానాన్ని తొలిసారిగా 1947-48 సీజన్ లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టులోని బౌలర్ వినూ మన్కడ్ వాడారు. ఆసీస్ ఆటగాడు బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజ్ ను దాటుతుండగా, పలుమార్లు వినూ మన్కడ్ హెచ్చరించాడు. అయినా బిల్ బ్రౌన్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో మన్కడ్ అతన్ని అవుట్ చేశాడు. దీంతో ఈ రనౌట్ కు 'మన్కడింగ్' అంటూ ఆస్ట్రేలియా మీడియా పేరు పెట్టింది.

ఈ తరహాలో అవుట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు అంటున్నా, అప్పుడప్పుడూ క్రికెట్ లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ అవుట్ కు మన్కడింగ్ అన్న పేరును తీసేయాలని సునీల్ గవాస్కర్ వంటి వారు చాలాసార్లు డిమాండ్ చేశారు. ఇలా అవుట్ అయిన తొలి ఆటగాడు బిల్ బౌన్ పేరు మీద 'బౌన్డ్' అని పిలిస్తే బాగుంటుందన్నది ఆయన ఉద్దేశం.

More Telugu News