Interfaith Marriage: వివాహితుడిని పెళ్లాడిన యువతి.. కలసి ఉండేందుకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి!

  • పెళ్లయిందని తెలిసీ ప్రేమించిన యువతి
  • ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ చేసుకున్న జంట
  • తల్లిదండ్రులు బంధించడంతో కోర్టును ఆశ్రయించిన భర్త
  • అతనితోనే ఉండేందుకు న్యాయమూర్తుల అనుమతి

పెళ్లయిన వ్యక్తిని ప్రేమించిన యువతిని అతనితో కలిసి ఉండేందుకు అనుమతిస్తూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మొయినుద్దీన్ అబ్బాసి అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తులు సందీప్‌ మెహతా, వినిత్‌ కుమార్‌ మథూర్‌ లు ఈ మేరకు తీర్పిచ్చారు.

కేసు వివరాల్లోకి వెళితే, అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్న మొయినుద్దీన్ ను, రూపాల్‌ సోనీ (26) ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదు. దీంతో వారిద్దరూ ఇంటర్ ఫెయిత్ (పరస్పర నమ్మకం) వివాహం చేసుకుని, దాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఆపై సోనీని ఆమె తల్లిదండ్రులు ఇంట్లో బంధించగా, ఆమెను చూపించాలంటూ మొయినుద్దీన్ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశాడు.

దీంతో సోనీని ఈ నెల 13న పోలీసులు కోర్టు ముందుకు తేగా, న్యాయమూర్తులు ప్రశ్నించారు. అతనికి వివాహమైన విషయం తెలుసునని సోనీ చెప్పడంతో, కేసు సున్నిత స్వభావం దృష్ట్యా ఆమె భవిష్యత్తు గురించి, తదనంతర పరిణామాల గురించి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. అయినప్పటికీ మొయినుద్దీన్ తోనే ఉంటానని ఆమె చెప్పింది. సోనీ మేజర్ కావడం, మానసిక పరిపక్వత గల మహిళగా, తనంతట తానుగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగివుందని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు, మొయినుద్దీన్‌ తో కలిసి ఉండేందుకు అనుమతించారు.

More Telugu News