Chandrababu: ఈ ఎన్నికల తర్వాత ఏపీ పేరెత్తాలంటేనే కేసీఆర్ భయపడాలి: చంద్రబాబు పిలుపు

  • ద్రోహులు హైదరాబాద్ నుంచి కుట్రలు చేస్తున్నారు
  • ఏపీ పేరెత్తాలంటేనే కేసీఆర్ భయపడిపోవాలి
  • ఖబడ్దార్.. మా జోలికి రావద్దంటూ హెచ్చరిక

టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా సత్యవేడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్, కేసీఆర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్లడు, జగన్ అసెంబ్లీకి రాడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దిగజార్చడానికి కొందరు ద్రోహులు హైదరాబాద్ లో ఉండి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడిన చంద్రబాబు, కేసీఆర్ కుట్రదారుడు అయితే జగన్ పాత్రధారుడు అని విమర్శించారు. ఇప్పటికే లక్ష కోట్లు దోపిడీ చేసి, పోర్టును కూడా లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీళ్లందరికీ మోదీ పెద్ద కాపలాదారు అని, మోదీకి ఏ టీమ్ టీఆర్ఎస్ అయితే బీ టీమ్ వైసీపీ అని వ్యాఖ్యానించారు.

వైసీపీ గురించి చెప్పాల్సి వస్తే ఆ పార్టీలో అందరూ రౌడీలు, దగాకోరులే కనిపిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వివేకాను చంపింది కుటుంబ సభ్యులే అయితే తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ఓటేస్తే శాంతిభద్రతలు క్షీణిస్తాయని, ఆడబిడ్డలు బయట తిరగలేని పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.

తనకు కుప్పం ఎలాగో సత్యవేడు కూడా అలాగేనని, ఇక్కడ కూడా 75 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని అన్నారు. టీడీపీని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అన్నిరకాలుగా ఇబ్బందిపెడుతున్న కేసీఆర్ పై కసి తీర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ పేరు ఎత్తాలంటేనే భయపడే పరిస్థితి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

More Telugu News