Telugudesam: అమరావతిలో అభివృద్ధి ఏమీ జరగకపోతే, మీ అన్న రెండున్నర ఎకరాల్లో వంద కోట్ల ఇల్లు ఎలా కట్టుకున్నాడు?: షర్మిలకు పంచుమర్తి కౌంటర్

  • షర్మిలది అవగాహన రాహిత్యం
  • వస్తానంటే వెంటతీసుకెళ్లి అమరావతి చూపిస్తా
  • పంచుమర్తి ప్రెస్ మీట్

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు గట్టి కౌంటర్ ఇచ్చాయి. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం ఏర్పాటుచేసి షర్మిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో అభివృద్ధి అనేదే జరగడంలేదని వ్యాఖ్యానించడం షర్మిల అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అనురాధ మండిపడ్డారు.

"షర్మిలమ్మా, మీకోసం కారు అరేంజ్ చేస్తాను, లేకపోతే బస్సులో వస్తానంటే బస్సు తీసుకువస్తాను, అది కూడా వద్దు హెలికాప్టర్ లోనే వస్తానంటే అలాగే రండి. మీ పక్కనుండి అమరావతి అంతా చూపిస్తాను. అమరావతిలో ఏం జరుగుతుందో మీ కళ్లకు కనిపించకపోతే అది మీ దౌర్భాగ్యం. అమరావతిలో ఏం అభివృద్ధి జరగకపోతే మీ అన్న రెండున్నర ఎకరాల్లో వంద గదుల ఇల్లు వందకోట్లు పెట్టి ఎలా నిర్మించుకున్నాడు? పరిశ్రమలు ఏవీ రాలేదని విమర్శిస్తున్నారు. కియా మోటార్స్ మీకు కనిపించడంలేదా? అశోక్ లేలాండ్ మీకు కనిపించడం లేదా? ఫాక్స్ కాన్ సెల్ కంపెనీలు మీకు కనిపించడంలేదా? ఏషియన్ పెయింట్స్ మీకు కనిపించడంలేదా? మీ తండ్రి హయాంలో లంచాలు ఇచ్చుకోలేక కంపెనీలు తమిళనాడుకు తరలిపోయాయి.

రైతుల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. మీ హయాంలో అన్నీ బాగుంటే 14 వేల మంది ఎందుకు ప్రాణాలు విడిచారు? ఎందుకు పవర్ హాలీడే, క్రాప్ హాలీడే ప్రకటించారు? మరి ఈ రోజు రూ.24,000 కోట్ల రూపాయలు చంద్రబాబునాయుడు గారు రైతు రుణమాఫీ చేశారు. 2014లో జగన్ రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెబితే, దాన్ని సాధ్యం చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు.

ఇక మీ కుటుంబం హత్యారాజకీయాలకు పెట్టింది పేరు అయితే మీరు హత్యారాజకీయాలంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. వెంకట నరసయ్య అనే చేనేత కార్మికుడ్ని చంపించింది మీ తాత రాజారెడ్డి కాదా? పరిటాల రవి ఆత్మీయులను వేలమందిని పొట్టనబెట్టుకుంది మీ వాళ్లు కాదా? వేల మంది పసుపుకుంకుమలు నేలరాసిన మీకు ఇవాళ పసుపుకుంకుమల గురించి మాట్లాడే నైతిక అర్హతలేదు.

'టీడీపీ, జనసేన' బంధం అంటూ మాట్లాడుతున్న మీరు అందుకు ఆధారాలు చూపించగలరా? కాఫీలు, టీలు తాగుతూ కేటీఆర్ తో చర్చలు జరిపింది మీ అన్నే. కేసీఆర్ గారు తెలంగాణ నుంచి ప్రచార రథాలు పంపించారు. ఆ రథాలకు రంగులైతే మార్పించారు కానీ గులాబీ రంగులో ఉన్న సీటు కవర్ ను మాత్రం అలాగే వదిలేశారు. అలాంటి మీరు మాపై ఆరోపణలు చేయడమా!" అంటూ నిప్పులు చెరిగారు.

More Telugu News