Telangana: టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ జి.వివేక్.. కేసీఆర్ ద్రోహం చేశారని మండిపాటు!

  • ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు పదవికి గుడ్ బై
  • ఈసారి ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయం
  • పార్టీ వ్యతిరేక పనులు చేశారంటున్న టీఆర్ఎస్ వర్గాలు

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీకి లోక్ సభ మాజీ సభ్యుడు జి.వివేక్ రాజీనామా చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి లోక్ సభ స్థానాన్ని తనకు కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన వివేక్ పార్టీకి రాజీనామా సమర్పించారు. మరోవైపు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయకూడదని వివేక్ నిర్ణయించారు. తొలుత వివేక్ కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి.

అయితే కార్యకర్తలతో నిన్న, ఈరోజు జరిగిన సమావేశాల్లో ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వివేక్ నిర్ణయించుకున్నారు. సమయం తక్కువగా ఉండటంతో స్వతంత్ర అభ్యర్థిగానూ పోటీ చేయరాదని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ద్రోహం కారణంగానే తాను పోటీకి దూరమయ్యానని వివేక్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని అయినందునే తనపై వివక్ష చూపారన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో వివేక్ కు పెద్దపల్లి లోక్ సభ టికెట్ నిరాకరించినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

More Telugu News