consumer form: న్యాయం గెలిచింది... గ్యాస్‌ సిలెండర్‌ పేలుడు బాధితులకు రూ.10 లక్షల పరిహారం

  • పదేళ్ల తర్వాత తీర్పు చెప్పిన వినియోగదారుల ఫోరం
  • 2008 ఆగస్టు 21న ప్రమాదం
  • ఇద్దరు మృతి...ఇద్దరికి తీవ్రగాయాలు

గ్యాస్‌ సిలెండర్‌ పేలుడు ఘటనలో అయినవాళ్లను కోల్పోయిన బాధిత కుటుంబానికి పదేళ్ల తర్వాత న్యాయం దక్కింది. చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి ఏజెన్సీ, బీమా కంపెనీలు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఎం.మహేష్‌, భార్య సంతోషి, తల్లిదండ్రులు భారతి, రాంచందర్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు.

బంజారా గ్యాస్‌ ఏజెన్సీలో ఇండేన్‌ కంపెనీ సిలెండర్‌ తీసుకుని వాడుకుంటున్నాడు. 2008 ఆగస్టు 21న గ్యాస్‌ లీకవుతోందని   ఫిర్యాదు చేయగా సాయంత్రం టెక్నీషియన్‌ బాలకృష్ణ వచ్చి రెగ్యులేటర్‌ మార్చుతున్నాడు.  ఆ సమయంలో గ్యాస్‌ లీకై పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో బాలకృష్ణతోపాటు మహేష్‌, అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించగా అదే ఏడాది సెప్టెంబరు 13న భారతి, 26న మహేష్‌ చనిపోయారు.

ఈ ఘటనపై మహేష్‌ భార్య, ఇతర కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌ పోలీసులతోపాటు జిల్లా వినియోగదారుల ఫోరం-3ని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఫోరం న్యాయమూర్తి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఏజెన్సీ, బీమా కంపెనీలను 2014 ఏప్రిల్‌ 28న ఆదేశించారు.

ఈ తీర్పుపై సదరు కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో అప్పీల్‌ చేయగా న్యాయమూర్తి కేసును పరిశీలించి కింది ఫోరం తీర్పును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే రూ.25 వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని తీర్పు చెప్పారు. దీంతో బాధిత కుటుంబానికి పదేళ్ల తర్వాత న్యాయం జరిగినట్టయింది.

More Telugu News