Andhra Pradesh: తుపాను కొన్ని ప్రాంతాలపైనే ప్రభావం చూపుతుంది.. కానీ జగన్ ప్రతీ అభివృద్ధి పనికి అడ్డుపడతాడు!: ఏపీ సీఎం చంద్రబాబు

  • జగన్ పిరికిపంద రాజకీయాలకు పాల్పడుతున్నారు
  • ఆయనకు అనుభవం లేదు.. ఉన్నదల్లా అహంభావమే
  • అమరావతిలో టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ లో తమ బతుకు తాము బతుకుతున్నవారికి శాశ్వత సమాధి కట్టాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత ఏపీలో పిరికిపంద రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్ లకు భయపడుతూ జగన్ వారివద్ద బానిసలా ఉన్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీ మన వేలితో మన కన్నే పొడుస్తారని హెచ్చరించారు.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 60 ఏళ్లుగా అభివృద్ధి  చేసిన ఆస్తిని లాక్కున్నారనీ, ఇప్పుడు జగన్ రూపంలో నవ్యాంధ్ర ఆస్తులను లాగేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పౌరుషంతో మన ఆస్తులను మనం కాపాడుకుందామని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఉంటున్నవారిని వేధిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. ఏపీలో అసమర్థ ప్రభుత్వం ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘ఏపీలో పుట్టడమే నేరమా అని హైదరాబాద్ లో ఉండే ప్రజలు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ అధినేత జగన్ తుపాను కంటే పెద్ద సమస్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తుపాను కొన్ని ప్రాంతాలపైనే ప్రభావం చూపుతుందనీ, కానీ జగన్ రాష్ట్రంలోని ప్రతీ అభివృద్ధి పనికి అడ్డుపడతారని ఆరోపించారు. జగన్ కు అనుభవం లేదనీ, ఉన్నదల్లా నిలువెల్లా అహంభావమేనని స్పష్టం చేశారు. వైసీపీకి ఓటేస్తే పింఛన్లు ఆగిపోతాయనీ, పంటపొలాలకు నీరు ఆగిపోయి పంటలు ఎండిపోతాయని హెచ్చరించారు.

More Telugu News