Haryana: నేను కాంగ్రెస్ లో చేరలేదు... ఆ ఫొటోలు పాతవి: సప్నా చౌదరి స్పష్టీకరణ

  • ట్విట్టర్ అకౌంట్ కూడా ఫేక్
  • ప్రియాంకతో ఉన్న ఫొటో పాతది
  • ఏ పార్టీకి ప్రచారం చేయడంలేదు

ఉత్తర భారతదేశంలో ఓపెన్ స్టేజ్ డ్యాన్సింగ్ ఎంతో ప్రజాదరణ పొందింది. బ్యాక్ గ్రౌండ్ లో జానపద, స్థానిక గీతాలు వస్తుండగా, అందమైన అమ్మాయి వేదికపై నర్తిస్తుండడాన్ని అక్కడి ప్రజలు బాగా ఇష్టపడతారు. ఇలాంటి వీడియోలకు మిలియన్లలో వ్యూస్ లభిస్తాయంటే అతిశయోక్తి కాదు. బీహార్, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి డ్యాన్సులు చాలా పాప్యులర్ అని చెప్పాలి.

ఇక ఈ డ్యాన్సులు చేసేవాళ్లలో సప్నా చౌదరి బాగా ఫేమస్. ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. అయితే, హర్యానాకు చెందిన సప్నా చౌదరి కాంగ్రెస్ లో చేరిందంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమమాలినికి మధుర లోక్ సభ నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు సప్నా చౌదరిని కాంగ్రెస్ బరిలో దింపుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు దర్శనమిచ్చాయి.

దీనిపై సప్నా చౌదరి స్పందించింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది. ఆ కథనాల్లో ఉన్న ఫొటోలు పాతవని వెల్లడించింది. తాను ప్రియాంక గాంధీతో ఉన్న ఫొటో కూడా ఇప్పటిది కాదని తెలిపింది. ఈ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి ప్రచారం చేయడంలేదని కూడా చెప్పింది. ఆఖరికి తనపేరిట ప్రచారంలో ఉన్న ట్విట్టర్ అకౌంట్ కూడా ఫేక్ అని సప్నా స్పష్టం చేసింది.

More Telugu News