amedhi: అమేథీలో ఎదురీత... అందుకే రాహుల్‌ పక్కచూపు: కేంద్రమంత్రి స్మృతిఇరానీ

  • దక్షిణాది నుంచి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు పోటీ చేస్తారన్న ఊహాగానాలు
  • దీనిపై విమర్శలు కురిపించిన కేంద్ర మంత్రి
  • కౌంటర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

ఆమేథీ నియోజకవర్గంలో ఎదురీదే పరిస్థితులు ఉండడం వల్లే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరో నియోజకవర్గం వెతుక్కుంటున్నారని కేంద్రమంత్రి  స్మృతిఇరానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్‌ గాంధీ ఈసారి అమేథీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో స్మృతిఇరానీ విమర్శలు కురిపించారు.

ఇన్నేళ్లుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ అక్కడి ప్రజల గురించి మాత్రం పట్టించుకోలేదన్నారు. అక్కడి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇది తెలిసే రాహుల్‌ పక్కచూపులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో రాహుల్‌పై పోటీచేసిన స్మృతిఇరానీ లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా ఆయనపై రెండోసారి అమేథీలో పోటీ చేస్తున్నారు.

కాగా, స్మృతి ఇరానీ విమర్శలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. గతంలో అమేథీతోపాటు చాందినీ చౌక్‌లో స్మృతిఇరానీని కాంగ్రెస్‌ ఓడించిన విషయం ఆమె మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించినా, రాజ్యసభ ద్వారా చట్టసభలోకి ప్రవేశించి పదవులు అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News