piyush goyal: కేసీఆర్, జగన్‌లు మాకు మిత్రులే.. బంధాన్ని బయటపెట్టేసిన బీజేపీ!

  • టీఆర్ఎస్, వైసీపీలు బీజేపీ-బి టీంలని టీడీపీ ఆరోపణ
  • ఆరోపణలను నిజం చేసేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు
  • ఆ రెండు పార్టీలు తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయన్న పీయూష్ గోయల్

కేసీఆర్, జగన్‌తో తమకు బలమైన బంధం ఉందంటూ సాక్షాత్తూ కేంద్రమంత్రే బయటపెట్టేసి టీడీపీ ఆరోపణలకు మరింత బలం చేకూర్చారు. ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్, జగన్ ఇద్దరూ తమకు మిత్రులేనని, వారు తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ కలయిక విషయంలో అదృష్టవశాత్తు ఎటువంటి జీఎస్టీ ఉండదని చమత్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ మీకు మిత్రులే కదా, మీతో కలిసేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అన్న విలేకరి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ‘కచ్చితంగా’ అని వ్యాఖ్యానించారు.  

రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 300 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తాను దేవాలయాలను సందర్శించబోనని రాహుల్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. కాగా, పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీలు.. బీజేపీ -బి టీములంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను బలపరిచేలా మంత్రి వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.

More Telugu News