Chandrababu: చంద్రబాబు, లోకేశ్ నామినేషన్ పత్రాల్లో తప్పిదం.. గుర్తించి సరిచేయడంతో తప్పిన ఇబ్బందులు

  • తండ్రి కాలమ్‌కు బదులు భర్త కాలమ్
  • ఆలస్యంగా గుర్తించిన అధికారులు
  • నామినేషన్ల ఆమోదానికి ఇబ్బందులు లేవని అధికారుల స్పష్టీకరణ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌లు సమర్పించిన నామినేషన్ పత్రాల్లో చిన్నపాటి తప్పిదం గందరగోళానికి దారితీసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తుండగా, లోకేశ్ మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థులు ఇద్దరూ తమ ఓటు హక్కు ఎక్కడ ఉన్నదీ చెబుతూ అందుకు సంబంధించిన అధికారిక పత్రాన్ని నామినేషన్ పేపర్లతో జత చేశారు. వీరిద్దరికీ తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలోనే ఓటుహక్కు ఉంది.

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాడేపల్లి తహసీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలలోని ఓ కాలమ్‌లో చిన్నపాటు పొరపాటు జరిగింది. చంద్రబాబు నాయుడు నారా.. భర్త ఖర్జూరనాయుడు అని చంద్రబాబుకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలోను, లోకేశ్ నారా.. భర్త చంద్రబాబునాయుడు అని లోకేశ్‌కు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలోను పేర్కొన్నారు. తండ్రి అని ఉండాల్సిన చోట భర్త అని ఉన్నప్పటికీ అధికారులు గుర్తించకుండా సంతకం చేసి ఇచ్చేశారు. తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు దానిని సరిచేసి మళ్లీ కొత్త వాటిని జత చేశారు. ఈ పొరపాటు వల్ల నామినేషన్ల ఆమోదానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు.

More Telugu News