Telugudesam: శుక్రవారం పోలింగ్ జరిగితే తన ఓటు కూడా వేసుకోలేని దుస్థితి జగన్ ది: చంద్రబాబు సెటైర్

  • కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు
  • ఇప్పటికే జగన్ కు రూ.1000 కోట్లు పంపారు
  • దమ్ముంటే జగన్, కేసీఆర్, మోదీ కలిసి పోటీచేయాలి

ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గుంటూరు ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుక్రవారం నాడు పోలింగ్ పెడితే తన ఓటు కూడా వేసుకోలేని దుస్థితి జగన్ దని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ తనపై ఉన్న కేసుల విచారణ కోసం ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. ఒక్క అవకాశం ఇవ్వమని జగన్ అడుగుతున్నారని, జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్టు అవుతుందని హెచ్చరించారు.

31 కేసులు ఉన్నట్టు జగన్ ఎన్నికల అఫిడవిట్ లో చూపించారని, అన్ని కేసులు పెట్టుకుని కూడా ఏమీ ఎరగనట్టు నటిస్తున్నాడని ఆరోపించారు. దేశంలో ఇంతటి కరుడుగట్టిన నేరచరిత్ర ఉన్న నాయకుడు మరొకరులేరని అన్నారు. ఇలాంటి నేరగాడికి ప్రధాని మోదీ కాపలాదారు అని ఎద్దేవా చేశారు. ఒక చిన్న కోడికత్తితో ఎంత పెద్ద డ్రామా ఆడారు? అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. చివరికి వివేకా హత్యను తనకు అంటగట్టాలని చూశారంటూ చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇక, కేసీఆర్ పైనా మండిపడ్డారు. "నాకు రిటర్న్ గిఫ్ట్ పంపుతానని కేసీఆర్ అంటున్నాడు. ఇప్పటికే రిటర్న్ గిఫ్ట్ కింద జగన్ కు రూ.1000 కోట్లు పంపాడు. హైదరాబాద్ లో ఏపీ నాయకులు ఆస్తులు అమ్ముకోకుండా బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. కోర్టులో స్టే ఉన్నా ఏపీ డీజీపీ ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారు. చీకటి రాజకీయాలు, ముసుగు రాజకీయాలు వదిలేసి జగన్, కేసీఆర్, మోదీలకు ధైర్యం ఉంటే కలిసి ఎన్నికల్లో పోటీచేయాలి" అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లు ఉండొచ్చని, కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

More Telugu News