Andhra Pradesh: విద్వేషపూరిత ప్రకటనలు చేస్తే కేసులు పెడతాం: రాజకీయ పార్టీలను హెచ్చరించిన సీఈవో

  • కొన్ని పార్టీలకు నోటీసులు ఇచ్చాం
  • వివరణలను పరిశీలిస్తున్నాం
  • నామినేషన్లపై తుదినిర్ణయం రిటర్నింగ్ అధికారిదే!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేశారు. జనవరి 11 నాటికి రాష్ట్రంలో 3,69,33,091 ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. జనవరి 11 తర్వాత కొత్తగా 22, 48, 308 ఓటర్లు నమోదయ్యారని వివరించారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,04,035 ఓటర్లున్నారని, విజయనగరంలో అత్యల్పంగా 18,17,635 ఓటర్లున్నారని వెల్లడించారు.

ఎన్నికల ప్రచార నియమావళి గురించి పేర్కొంటూ, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలపై పార్టీలకు నోటీసులు కూడా ఇచ్చామని ద్వివేది తెలిపారు. పార్టీల నుంచి వచ్చిన వివరణలను పరిశీలిస్తున్నామని, ఒకవేళ విద్వేషపూరిత ప్రకటనలుగా భావిస్తే మాత్రం కేసులు పెట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇక, ఎన్నికల ఘట్టంలో ఎంతో కీలకమైన నామినేషన్లను ఆమోదించడంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయమే కీలకం అని స్పష్టం చేశారు. సర్వేలు, విశ్లేషణలు ఎన్నికల పరంగా చూస్తే తప్పుగా భావించనవసరంలేదని తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో 50 శాతం నకిలీవేనని వెల్లడించారు.

More Telugu News