Telangana: కేసీఆర్ నమ్మించి గొంతు కోస్తారని అనుకోలేదు.. టీఆర్ఎస్ కు పెద్దపల్లిలో జీవం పోసింది నేనే!: మాజీ ఎంపీ వివేక్

  • దళితుడిని అయినందునే చిన్నచూపు చూశారు
  • పెద్దపల్లిని వెంకటస్వామి జిల్లాగా మారుస్తామని చెప్పి మాటతప్పారు
  • ఈరోజు సాయంత్రం కార్యాచరణను ప్రకటిస్తా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను నమ్మించి గొంతు కోశారని లోక్ సభ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ నేత వివేక్ విమర్శించారు. దళితుడిని అయినందుకే తనను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుడినైన తనకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పడంతోనే టీఆర్ఎస్ లో చేరానని గుర్తుచేశారు. అప్పుడు పెద్దపల్లి జిల్లాను వెంకటస్వామి జిల్లాగా మారుస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ముఖ్యమంత్రి నమ్మించి గొంతు కోస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దపల్లిలో ఈరోజు అనుచరులు, మద్దతుదారులతో సమావేశమైన వివేక్ ‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించా. పెద్దపల్లి పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి జీవం పోసింది నేనే. నా పేరు లోక్ సభ అభ్యర్థుల జాబితాలో లేకపోవడం బాధాకరం. టీఆర్‌ఎస్‌లో నేను ఎవరినీ మోసం చేయలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు నాపై తప్పుడు సమాచారం ఇచ్చారు.

శాసనసభ ఎన్నికల్లో నేను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని స్పష్టం చేశారు. లోక్ సభ అభ్యర్థిగా టికెట్ దక్కినా, దక్కకున్నా పెద్దపల్లి ప్రజలతోనే ఉంటానని తేల్చిచెప్పారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం ఉందని వ్యాఖ్యానించారు. ఇవాళ సాయంత్రం అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు.

More Telugu News