Andhra Pradesh: జగన్ అఫిడవిట్ కోసం బాండ్ పేపర్ కూడా హైదరాబాద్ లోనే కొన్నాడు!: ఏపీ సీఎం చంద్రబాబు

  • అమరావతి రైతులు నన్ను చూసి భూములు ఇచ్చారు
  • అదే జగన్ ను చూస్తే ఇచ్చేవారా?
  • హంతకుల గుండెల్లో నిద్రపోతాం

దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నామని  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో తనను చూసి రైతులు భూములు ఇచ్చారనీ, అదే జగన్ ను చూస్తే ఇచ్చేవారా? అని ప్రశ్నించారు. జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉందనీ, ఆయన ఎలా ఆడిస్తే జగన్ అలా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. లోటస్ పాండ్ లో వీరిద్దరూ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఏపీపై కక్ష కట్టారని చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఆంధ్రావాళ్లు ద్రోహులని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులను లాక్కుని ఇక్కడికి పంపించారనీ, వాటా కూడా ఇవ్వలేదన్నారు. రైతులకు తెలంగాణ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ఏపీలో రూ.లక్షన్నర మాఫీ చేశామని గుర్తుచేశారు. అసలు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో తనకు సంబంధం ఉందన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము హత్యలు చేయబోమని.. హత్యలు చేసిన వారి గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు.

వైసీపీ అధినేత జగన్ 31 కేసులు పెట్టుకుని ఏమీ ఎరగనట్లు నటిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ చివరికి ఎన్నికల అఫిడవిట్ కోసం దాఖలు చేసిన స్టాంప్ పేపర్ ను కూడా హైదరాబాద్ లోనే కొన్నాడని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్‌ కుమ్మక్కై మనపైకి వస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ జగన్ కు రూ.1,000 కోట్లు పంపారని చంద్రబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్న టీడీపీ దగ్గర డబ్బులు లేకపోయినా కోడికత్తి పార్టీ దగ్గర పుష్కలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇన్ని కేసులు ఉన్న జగన్ ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.

More Telugu News