Andhra Pradesh: దేశమంతా జీఎస్టీ ఉంటే పలాసలో మాత్రం టీఎస్టీ వేస్తున్నారు!: వైసీపీ అధినేత జగన్ సెటైర్లు

  • టీడీపీ ఎమ్మెల్యే అల్లుడు దోచుకుంటున్నాడు
  • స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు దక్కేలా చేస్తాం
  • నిరుద్యోగ యువతకు కాంట్రాక్టులు అందిస్తాం
  • పలాస బహిరంగ సభలో వైసీపీ అధినేత విమర్శలు

దేశమంతా వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ఉంటే శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో మాత్రం టీఎస్టీ(తెలుగుదేశం ట్యాక్స్) ఉందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అల్లుడు ప్రస్తుతం దోపిడీకి పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు దక్కేలా చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే ఇస్తామన్నారు. పలాసలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

నిరుద్యోగులకు ఇచ్చే కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం దక్కేలా చూస్తామన్నారు.  ‘మండుతున్న ఎండల్లో కూడా చక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరి ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూన్నా. నేను రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. రాష్ట్రంలో,దేశంలో జీఎస్టీ ట్యాక్స్‌ విన్నామన్నా.. కానీ ఈ పలాసలో టీఎస్టీ అంటూ తెలుగుదేశం వేస్తున్న ట్యాక్స్‌ గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. ఇక్కడి ఎమ్మెల్యే అల్లుడి దోపిడి గురించి చెప్పిన మాటలు విన్నాను. వ్యాపారులపై దాడులు, అధికారులపై వేధింపులు నేను విన్నాను. భావనంపాడు పోర్టులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మీరు చెప్పిన మాటలు గుర్తుకున్నాయి.

తిత్లీ తుఫాను పరిహారం అందలేదని చెప్పిన మాటలు విన్నా. ఆ రోజు మీకు భరోసా ఇస్తూ నేను చెప్పిన మాటలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులకు పరిహారంగా కొబ్బరి చెట్టుకు రూ.3వేలు, హెక్టార్‌ జీడీ తోటకు రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తాం. కిడ్నీ బాధితుల సమస్యలను చూశాను. వారి గాథలను విన్నాను. కిడ్నీ వ్యాధుల రావడానికి కారణం తాగే మంచి నీరు అని తెలిసి కూడా పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని చూశా. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోగా 200 పడకల ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తాం. కాలువల ద్వారా సాగు, తాగు నీరు అందిస్తాం’ అని తెలిపారు.

More Telugu News