Andhra Pradesh: విజయవాడ నుంచి 200-300 అల్లరిమూకలు దిగాయి.. వైసీపీ శ్రేణులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాయి!: కొడాలి నాని ఆరోపణ

  • టీడీపీ అభ్యర్థుల్లో 100 మంది ఓడిపోతారు
  • అన్ని కులాలు ఒకటేన్న భావనతో ముందుకుపోతున్నాం
  • ఇబ్బంది పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్

గతంలో తాను గుడివాడ నియోజకవర్గం నుంచి గెలిచినా, అప్పట్లో చంద్రబాబు ఇమేజ్ వల్ల మాత్రం తాను గెలవలేదని వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో చాలామందికి సీట్లు ఇచ్చారనీ, వారిలో కొందరు గెలుస్తుంటారు, మరికొందరు ఓడిపోతుంటారని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు ఇటీవల ప్రకటించిన 126 మంది అభ్యర్థుల్లో 100 మంది పోతారని జోస్యం చెప్పారు. తాను గుడివాడలో శాసనసభ్యుడిని అయ్యాక కులాలతోనూ, మతాలతోనూ ఘర్షణలు లేవని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలతో గుడివాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నాని మాట్లాడారు.

అన్ని కులాలు మానవకులం అనే భావనతో తాము ఉన్నామన్నారు. అన్న ఎన్టీఆర్, వైఎస్సార్, వంగవీటి మోహనరంగా, డా.బీఆర్ అంబేద్కర్ చూపిన దారిలో ముందుకు పోతున్నామని నాని తెలిపారు. విజయవాడలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఓ మహానుభావుడిని పొట్టనపెట్టుకున్న కుటుంబం నుంచి ఓ వ్యక్తిని తెచ్చి, ఈ రోజు ఇక్కడ పోటీకి పెట్టారని దేవినేని అవినాశ్ పేరును పరోక్షంగా నాని ప్రస్తావించారు.

ప్రస్తుతం విజయవాడ నుంచి 200-300 అల్లరిమూకలు గుడివాడలో దిగారనీ, ఇళ్లు తీసుకుని ఉంటున్నారని ఆరోపించారు. గుడివాడలోని తమ మద్దతుదారులకు విజయవాడ నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంతమంది వైసీపీ శ్రేణులను వ్యక్తిగతంగా కలిసి భయపెడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టాలని భావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాని హెచ్చరించారు.

More Telugu News