YSRCP: వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్.. ధర్మాసనం ప్రశ్నలతో పిటిషనర్ ఉక్కిరిబిక్కిరి

  • సీబీఐ దర్యాప్తు కోరే అర్హత ఎక్కడిదన్న కోర్టు
  • సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన న్యాయవాది
  • గడువు ఇస్తే పూర్తి వివరాలు ఇస్తామన్న పిటిషనర్

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషన్‌దారును హైకోర్టు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలుత ఈ పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో విఫలమైన పిటిషనర్ తరపు న్యాయవాది పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు.

వివేకా హత్యకేసును కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరుతూ  అనిల్ కుమార్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై వాదనలు వినిపించేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది సిద్ధమవుతుండగా జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మధ్యలో కల్పించుకుంది. వ్యాజ్యం దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఉన్న అర్హతేంటో చెప్పాలని బెంచ్ ప్రశ్నించింది. తమ క్లయింట్ ప్రజా సమస్యలపై పోరాడతారని, గతేడాది జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనపై కూడా పిల్ దాఖలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు.

దీంతో స్పందించిన ధర్మాసనం.. ఆ మాత్రానికే సీబీఐ దర్యాప్తు కోరేంత అర్హత ఉందని అనుకుంటున్నారా? అని ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరి అయిన న్యాయవాది పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని కోరారు. అదే సమయంలో మరో న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారని, దానిపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు సమ్మతించిన ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

More Telugu News