Pawan Kalyan: తెలంగాణలో అప్పుడు నన్ను కొట్టడానికి వందమంది వచ్చారు: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  • అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రాజకీయాల్లోకి
  • లక్ష మంది వచ్చినా భయపడను
  • తప్పు చేస్తే తోలుతీస్తా

ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ నాయకులు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నా హైదరాబాద్‌లో ఉన్న మన ఎమ్మెల్యేలకు మాట్లాడడానికి ధైర్యం లేకుండా పోయిందన్నారు.

ఓసారి తాను తెలంగాణలో సభ పెడితే తనను కొట్టేందుకు ఏకంగా వందమంది వచ్చారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందమంది తన సభలో దూరిపోయి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. తనను కొడితే కూర్చోబెట్టి చేతులు ముడుచుకుని ‘అయ్యా, బాబూ’ అనే రకం తాను కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. వారు కొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని, తాము అల్లూరి స్ఫూర్తితో పెరిగిన వాళ్లమని పవన్ గుర్తు చేశారు.

తాము సత్యమే మాట్లాడతామని, తప్పుంటే సరిదిద్దుకుంటామని పేర్కొన్న పవన్.. తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని, తోలుతీస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో తమ గొంతులు నొక్కే హక్కు ఎవరికీ లేదన్నారు. అది హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా ఎక్కడైనా అంతేనన్నారు. తాను భారతీయుడినని, ఎక్కడైనా మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని పవన్ స్పష్టం చేశారు. తనను కొట్టేందుకు ఎన్ని లక్షల మంది వచ్చినా భయపడనని పేర్కొన్న పవన్.. ఆ రోజు తనను కొట్టడానికి వచ్చిన వందమంది ఆ తర్వాత చప్పట్లు కొట్టి వెళ్లిపోయారని పవన్ పేర్కొన్నారు.  

More Telugu News