Tollywood: నరేష్ మైక్ లాగేసుకోవడంతో హేమ అసహనం!

  • నరేష్ తీరుపై హేమ అసంతృప్తి
  • అందరితో చర్చించాలంటూ సూచన
  • కార్యవర్గంలో అందరూ ఒక్కటేనంటూ హితవు

తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం శుక్రవారంనాడు కొలువుదీరింది. అధ్యక్షుడిగా నరేష్, ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా జీవిత, మరో ఉపాధ్యక్షురాలిగా ఇండిపెండెంట్ గా గెలిచిన హేమ ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో అధ్యక్షుడు నరేష్ వైఖరి పలు విమర్శలకు తావిస్తోంది. నరేష్ తన ప్రసంగంలో పలుమార్లు నేను అని చెప్పుకోవడాన్ని హీరో రాజశేఖర్ బహిరంగంగానే తప్పుబట్టారు.

అలాగే నటి హేమ కూడా నరేష్ వైఖరితో అసహనానికి గురయ్యారు. జీవిత ప్రసంగం పూర్తయ్యాక హేమ మాట్లాడాలనుకున్నారు. "నేను నరేష్ గారికి మనవి చేసేది ఏంటంటే.." అంటుండగానే నరేష్ వచ్చి మైక్ లాగేసుకోవడంతో అసంతృప్తికి గురయ్యారు. అందరూ మాట్లాడమని కోరుతున్నారు అని హేమ ఎంత చెప్పినా నరేష్ వినిపించుకోకపోవడంతో రాజశేఖర్ మైక్ అందించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, వేదికపై నరేష్ ప్రకటించిన నిర్ణయాలన్నీ ఆయన సొంత నిర్ణయాలేనని, మా కార్యవర్గంలో ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. కార్యవర్గంలోని 26 మంది ఒక్కటేనని, కొత్త అధ్యక్షుడు అందరితో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవాలని, అందరినీ కలుపుకుని వెళ్లకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరికాదని హేమ హితవు పలికారు. "క్షమించాలి నరేష్ గారూ... మీరిలా చేయడం నాకు నచ్చలేదు" అంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు.

More Telugu News