shivaji: కేసీఆర్ గారు.. అదే జరిగితే హైదరాబాదు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి: శివాజీ

  • హైదరాబాదులో 35 లక్షల మంది ఆంధ్రులు ఉన్నారు
  • వీరిలో కొన్ని లక్షల మంది ఏపీకి తిరిగొచ్చినా.. ఏమవుతుందో ఊహించుకోండి
  • తెలంగాణ రాష్ట్రం ఏపీపై కక్ష తీర్చుకోవడానికి ఏర్పడిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ హీరో శివాజీ మండిపడ్డారు. కేసీఆర్ గారు మీకు ఏం కావాలి? ఏపీకి వచ్చి మీరు ధైర్యంగా పోటీ చేయండి లేదా నేరుగా మీకు నచ్చిన పార్టీకి మద్దతు ప్రకటించండని అన్నారు. ఎందుకోసం, ఎవరి కోసం మీరు ఏపీపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 హైదరాబాదులో 35 లక్షల మంది ఆంధ్రులు ఉన్నారని... వీరిలో కొన్ని లక్షల మంది ఏపీకి తిరిగివచ్చినా, హైదరాబాదు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు మీపై తిరగబడితే ఏమవుతుందో ఊహించుకోవాలని అన్నారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులను బెదిరిస్తున్నారని... ఇలాంటి రాజకీయాలు వద్దని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలిపశువులను చేయవద్దని అన్నారు.

వందలాది మంది ప్రాణత్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం... ఏపీపై కక్ష తీర్చుకోవడానికి ఏర్పడిందా? అని శివాజీ ప్రశ్నించారు. ఎవరి ప్రాణత్యాగాల మీద సొంత రాచరిక వ్యవస్థను మీరు నిర్మించుకుంటున్నారని అడిగారు. ఓట్ల తొలగింపులో మీ పాత్ర లేదనే విషయాన్ని మీరు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై మొన్నటికి మొన్న కూడా సుప్రీంకోర్టులో మీరు కేసు వేశారని మండిపడ్డారు. హైదరాబాదులోని మా ప్రజలను భయపెట్టి... ఏపీలో ఉన్న ప్రజలను భయాందోళనలకు ఎందుకు గురి చేస్తున్నారని అన్నారు. మీకు అంత కసి ఉంటే ఫ్యాక్షనిస్టులతో మాట్లాడుకుని, మీకు అవసరం లేని వ్యక్తులను చంపేయండని చెప్పారు.

ఏపీకి డబ్బు పంపించవద్దని ఈరోజు ఆర్బీఐ ఆదేశాలు ఉన్నాయని... రాష్ట్రానికి డబ్బు కొరత వచ్చేలా చేశారని శివాజీ అన్నారు. ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయని... దెబ్బ తినేది ప్రజలేనని చెప్పారు. సినిమావాళ్లు కూడా ఇప్పుడొచ్చి ఏపీ పార్టీల్లో చేరుతున్నారని... వీరంతా ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? అని నిలదీశారు. ఇప్పుడు ఇక్కడి రాజకీయ పార్టీల్లో చేరి మీరు సాధించేది ఏమిటని ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో మీరు రాజకీయ పార్టీల్లో చేరుతున్నారని అడిగారు.

More Telugu News