Pawan Kalyan: జగన్ పై నాకున్న అభిప్రాయాలను ఎలా మార్చుకుంటానని వారికి చెప్పా.. కేసీఆర్ రాజమార్గంలో రావాలి: పవన్ కల్యాణ్

  • వైసీపీ, టీఆర్ఎస్ రహస్య అజెండా అందరికీ తెలిసిపోయింది
  • కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. చంద్రబాబుకు గిఫ్ట్ గా మారుతుంది
  • వైసీపీ అధికారంలోకి వస్తే ఏదీ మిగలదు.. అన్నీ దోచేస్తారు

వైసీపీ, టీఆర్ఎస్ రహస్య అజెండా ఏపీ ప్రజలకు తెలిసిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పదేళ్లు భావోద్వేగాలతో గడచిపోయాయని... ఇప్పటికైనా అలాంటి రాజకీయాలు ఆపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ లకు సూచించారు. చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్... చివరకు ఆయనకు గిఫ్ట్ గా మారుతుందని చెప్పారు. ఏపీలో జగన్ తో కలసి పోటీ చేయాలని గతంలో తనకు కొందరు సూచించారని... రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేసిన తర్వాత... మీరు, జగన్ తేల్చుకోవాలని చెప్పారని తెలిపారు. అయితే, జగన్ పై ఇప్పటికే తనకున్న అభిప్రాయాన్ని తాను ఎలా మార్చుకుంటానని వారికి తాను సమాధానమిచ్చానని చెప్పారు.

వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే భూకబ్జాలే కాదు... మీ ఇల్లు, ఆ కొండ, కొండ మీద పుట్ట, కొండపైనున్న చెట్టును కూడా దోచేస్తారని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల కిరాయి మూకలకు, రౌడీలకు భయపడమని చెప్పారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే... నేరుగా ఏపీలో కేసీఆర్ పోటీ చేయాలని, రాజమార్గంలో రావాలని అన్నారు.

మేరా మిత్ర్ పవన్ కల్యాణ్, మేరా భాయ్ పవన్ కల్యాణ్ అని ప్రధాని మోదీ అన్నప్పుడు అంతా పొంగిపోయారని... తాను మాత్రం పొంగిపోలేదని పవన్ అన్నారు. అంత మర్యాద ఇస్తున్నారంటే తర్వాత వదిలేస్తారని అప్పుడే అనుకున్నానని చెప్పారు. ఏపీ అసెంబ్లీ జనసేన చేతిలోకి రావాలని అన్నారు. ఎవరెవరో సీఎం అయినప్పుడు... కానిస్టేబుల్ కొడుకు, పోస్ట్ మాస్టర్ మనవడు కాలేడా? అని ప్రశ్నించారు.

More Telugu News