ap7am logo

ఏ2 ముద్దాయికి నిజాయతీగల అధికారిని విమర్శించే హక్కు లేదు: ప‌వ‌న్ కల్యాణ్

Fri, Mar 22, 2019, 06:54 AM
  • రాయలసీమ నాయకులు విశాఖలో సెటిల్మెంట్లు చేస్తే ఊరుకోం
  • ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తలుగా ఉండాల్సినవాళ్లే దోచేస్తే ఎలా?
  • విశాఖ భూ కబ్జాలపై వేసిన సిట్ నివేదికపై చర్యలు ఏవి?
  • భీమిలి నియోజకవర్గం ఆనందపురం సభలో పవన్ కల్యాణ్
నేర‌స్తులు, త‌ప్పుడు ప‌నులు చేసే వ్యాపార‌స్తులు చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్తే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌దని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ కల్యాణ్ పేర్కొన్నారు. రాయ‌ల‌సీమ నాయ‌కులు విశాఖ‌లో బెదిరించి సెటిల్మెంట్లు చేస్తే చూస్తూ ఉరుకోమ‌ని హెచ్చ‌రించారు. విశాఖపట్నం లోక్ స‌భ అభ్య‌ర్ధిగా వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ గారిని ప్ర‌క‌టిస్తే ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డికి ఎందుకంత భ‌యం? అని పవన్ ప్ర‌శ్నించారు. ఏ2 ముద్దాయికి ఒక నిజాయతీ గ‌ల సీబీఐ మాజీ అధికారిని విమ‌ర్శించే హ‌క్కులేద‌ని అన్నారు.

గురువారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనంద‌పురంలో నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొని, ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. “10వ త‌ర‌గ‌తిలో బొటా బొటి మార్కుల‌తో పాస్ అయినా నేను ఇవాళ మీ ముందు ఇలా నిల‌బ‌డితే.. సీ.ఏ చ‌దివిన విజ‌య‌సాయిరెడ్డి గారు మాత్రం సూట్ కేసు కంపెనీలు పెట్టి వేల‌కోట్లు ఎలా దోచేయాలో నేర్చారు. నేను నేర్చుకున్న విలువ‌లు ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ్డం, క్రిమిన‌ల్స్ తో ఫైట్ చేసే ధైర్యం ఇస్తే.. ఆయ‌న చ‌దువు మాత్రం ప‌క‌డ్బందీగా లంచాలు ఎలా తీసుకోవ‌చ్చో నేర్పించాయి.

ల‌క్ష్మీనారాయ‌ణ‌గారు జ‌న‌సేన పార్టీలో చేర‌గానే విజ‌య‌సాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆయ‌న‌కు అంత అవ‌స‌రం ఏమొచ్చింది? ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు నేనేమైనా ట్వీట్చేశానా..?. ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారికి, విజ‌య‌సాయి రెడ్డి గారికి ఒక‌టే చెబుతున్నాను... పులివెందుల‌లో పుడితే మీరు ఏమ‌న్నా ప‌డ‌తాం అనుకోవ‌ద్దు. నందికొట్కూరు దగ్గర వున్న కొణిద‌ల గ్రామం పేరు ఇంటి పేరుగా ఉన్నవాణ్ని. కిరాయి రౌడీలు, వేల‌కోట్లు, ప్రైవేటు సైన్యాలు ఏం చేయ‌లేవు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోబోం. మ‌హాత్మా గాంధీ, కాన్షీరాం ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తున్నాం. అవ‌స‌ర‌మైతే నేతాజీ, భ‌గ‌త్ సింగ్ వార‌సుల‌మ‌వుతాం.
 ప్రజల నుంచే నాయకులు పుట్టాలి. 2014లో ఏమీ ఆశించ‌కుండా తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చి గెలిపించాం. వాళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు విశాఖ జిల్లాలో భూములు దోచేశారు. భీమిలి భూ క‌బ్జాల‌పై ముఖ్య‌మంత్రిగారు వేసిన సిట్ రిపోర్టు ఏమైందో తెలియ‌దు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఏవి?

ప్ర‌భుత్వ ఖ‌జానాకు ధ‌ర్మ‌క‌ర్త‌లుగా ఉండాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులే భూములు దోచేస్తే.. ప్ర‌జ‌లు ఎవ‌రితో చెప్పుకోవాలి. ఇవ‌న్నీ మారాలంటే ప్ర‌జ‌ల నుంచే నాయ‌కులు పుట్టాలి. జ‌న‌సేన అలాంటి నాయ‌కుల‌నే నిల‌బెడుతుంది. న‌న్ను చాలామంది తెలుగుదేశం వాళ్ళు విమ‌ర్శిస్తున్నారు. వారికి ఒక‌టే చెబుతున్నాను. నేను సినిమా యాక్ట‌ర్ అనుకుంటున్నారేమో .. కాదు. ప్ర‌జ‌ల క్షేమాన్ని కోరుకునే వ్య‌క్తిని. సామాజిక విలువ‌లు తెలిసిన వాడిని. ప‌బ్లిక్ పాల‌సీల‌ను చ‌దువుకున్న‌వాడిని. పార్టీలు, ప‌బ్ లు అని తిరిగేవాడిని కాదు. స‌మ‌స్య‌లు అర్ధం చేసుకోవ‌డానికి, దేశానికి ప‌నికొచ్చే ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను.

• గంటా భయపడి భీమిలి వదిలి పారిపోయారు. 2014లో గంటాను గెలిపించాల‌ని ప్ర‌చారం చేశాను. హామీలు నిల‌బెట్టుకోలేని ప‌క్షంలో ప్ర‌జ‌ల త‌రపున నిల‌దీస్తాన‌ని చెప్పాను. ఇవాళ నిల‌దీయ‌డానికి వ‌స్తే ఆయ‌న భ‌య‌ప‌డి భీమిలి వ‌దిలి పారిపోయారు. భీమిలి నుంచి పారిపోయినా విశాఖ నార్త్ లో మిమ్మ‌ల్ని ప‌ట్టుకుంటాం. రూ. 30 కోట్లు విసిరేసి ఓట్లను కొనొచ్చు.. యువ‌త‌కు బైక్ లు ఇచ్చి గెలిచేయగలం అనుకుంటున్నారేమో, మీరిచ్చే లంచాల‌కు లొంగిపోయే యువ‌త కాదిది.

రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి వ‌చ్చిన స‌రికొత్త త‌రం. భీమిలిలో జ‌న‌సేన జెండా క‌ట్టిన కార్య‌క‌ర్త‌ల‌ను వేధించారు. జైల్లో పెట్టారు. జ్యూట్ మిల్లు మూసేసి, దాని ఆస్తులు ఆమ్ముకోవాల‌ని చూశారు. కార్మికులు ఎదురు తిర‌గ‌డంతో భీమిలి నుంచి పారిపోయారు. మీరు భీమిలి నుంచి పారిపోయినా మేము వెంట‌ప‌డి వెంట‌ప‌డి వేధిస్తాం. మీరు మా వాళ్ల‌ను ఎంత వేధించారో.. అంత‌కుమించి మిమ్మ‌ల్ని వేధిస్తాం.

రాజ‌కీయాల్లోకి మేము మీలా మోసం చేయ‌డానికి రాలేదు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండ‌టానికి వ‌చ్చాం. మాయమాట‌లు చెప్పే మీలాంటి వాళ్ల‌ను చొక్కాలు ప‌ట్టి నిల‌దీయ‌డానికి వ‌చ్చాం. అవంతి శ్రీనివాస్ గారిని చూస్తే ‘ధూపం వేస్తే పాపం పోతుందా..?’ అన్న ఒక సామెత గుర్తొస్తుంది. ప్ర‌జారాజ్యం పార్టీలో సీటు ఇచ్చి ప్ర‌చారం చేసి గెలిపిస్తే ఏం చేశావు..? అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచావంటే ఎవ‌రివ‌ల్ల‌..?. నిజంగా అన‌కాప‌ల్లి ప్ర‌జ‌ల‌కు మీరు న్యాయం చేసుంటే అక్క‌డ నుంచి పారిపోయి భీమిలికి రావాల్సి వ‌చ్చేది కాదు. గంటా గారు ఎలా పారిపోయారో అవంతి గారిని ఎన్నుకుంటే అలానే పారిపోతారు.

పార్ల‌మెంటులో స్పెష‌ల్ స్టేట‌స్ గురించి మాట్లాడాలంటే అవంతి గారికి భ‌యం. మోదీగారు ఎక్క‌డ చూసేస్తారో అని న‌క్కి న‌క్కి దాక్కుంటారు. ఇలాంటి వ్యాపార‌స్తుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం లేద‌నే అన్ని ర‌కాలుగా ఆలోచించి భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి చ‌దువుకున్న యువ‌కుడు, విజ్ఞత‌క‌ల‌వాడు, వివేక‌వంతుడైన సందీప్ పంచ‌క‌ర్ల గారిని నిల‌బెట్టాను. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తారా..? లేదా అని లీడ‌ర్ షిప్ ప్రోగ్రాంలో సందీప్ ను అనేక క‌ష్టాల‌కు గురి చేశాను. అరిచాను, తిట్టాను. ఐదేళ్లు ప‌రీక్షించి ఇవాళ మీ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్ధిగా నిల‌బెట్టాను.
 టీడీపీ అభ్యర్థి హ‌రి గారిని, వైసీపీ అభ్య‌ర్ధి అవంతిగారిని, జ‌న‌సేన అభ్య‌ర్ధి సందీప్ ను నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగిన‌ప్పుడు భీమిలీకి ఏం చేస్తారు? అని అడ‌గండి. అవంతిగారు కాలేజీల్లో వ‌చ్చిన డ‌బ్బులు పంచిపెడ‌తాన‌ని చెబుతారు. సందీప్ ను అడ‌గండి మూత‌ప‌డ్డ జ్యూట్ మిల్లు తెరిపిస్తామ‌ని చెబుతాడు, దివీస్ ప‌రిశ్ర‌మ కాలుష్యాన్ని అరిక‌డ‌తామ‌ని చెబుతాడు. ప‌రిశ్ర‌మ‌లు పెట్టి ఉపాధి క‌ల్పిస్తామ‌ని చెబుతాడు. మ‌త్స్యకారుల సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తామ‌ని చెబుతాడు.

మిగ‌తా పార్టీ నాయ‌కులు రాజ‌కీయాలను వ్యాపార ధోర‌ణిలో చూస్తే.. జ‌న‌సేన పార్టీ మాత్రం సామాజిక సేవ‌కోసం రాజ‌కీయాలు చేస్తుంది. విశాఖ‌ప‌ట్నం ఎంపీ అభ్య‌ర్ధిగా వంద‌ల‌కోట్లు పెట్టేవారు కాదు... బ‌ల‌మైన విలువ‌లు క‌లిగిన వారు, ధైర్యంగా నిల‌బ‌డేవారు కావాల‌నుకున్నాను. అలాంటి స‌మ‌యంలో ల‌క్ష్మీనారాయ‌ణ గారు క‌నిపించారు. ఎంపీగా గెల‌వ‌డానికి వంద‌ల‌ కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం ఏంటి ద‌రిద్రంగా.. కోట్లు ఖ‌ర్చుచేయ‌డం అంటే అంబేద్కర్  ఆశ‌యాల‌ను తూట్లు పొడ‌వ‌డ‌మే.

మీరు రాజ్యంగంతో మాట్లాడితే మేము రాజ్యాంగంతో మాట్లాడుతాం. మీరు కత్తి, కర్రలతో మాట్లాడితే .. మేము క‌త్తి, క‌ర్ర‌ల‌తో మాట్లాడుతాం. బొత్స గారిని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసినోడు శ్రీ ముక్కా శ్రీనివాస‌రావు. ఆయ‌న్ను విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట్  అభ్య‌ర్ధిగా నిల‌బెడుతున్నాం. ఆయ‌న్ను భారీ మెజార్టీతో గెలిపించాలి' అంటూ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌న‌సైనికుల‌కు అండ‌గా ఉంటూ.. బెల్ట్ షాపుల‌పై పోరాటం చేయాల‌ని శ్రీనివాస‌రావుకు సూచించారు. 'నేను ఓటుకు డ‌బ్బులు ఇవ్వ‌లేను కానీ, నా విలువైన జీవితాన్ని ఇవ్వ‌గ‌ల‌ను. అంద‌రూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి జ‌న‌సేన అభ్య‌ర్ధుల‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌”ని కోరారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement