Telugudesam: టీడీపీ సింగిల్ గా బరిలో దిగడం 37 ఏళ్లలో ఇదే ప్రథమం!

  • 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిపోరు
  • ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోని టీడీపీ
  • ఈసారి పెద్దపార్టీలన్నీ ఒంటరిగానే పోరు

చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతోంది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ప్రచారం కొనసాగిస్తున్న టీడీపీ గడిచిన 37 ఏళ్ల చరిత్రలో ఎవరితోనూ పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీచేయడం ఇదే ప్రథమం అని చెప్పాలి. గత ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీచేసిన ఈ ప్రాంతీయ పార్టీ ఈసారి ఎవరితోనూ జట్టుకట్టలేదు. అంతెందుకు, మొన్నటికిమొన్న తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సైతం ప్రజాకూటమిలో భాగమైన టీడీపీ ఈ పర్యాయం ఆనవాయితీని బ్రేక్ చేసింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ సహా అనేక పార్టీలతో మైత్రి కొనసాగిస్తున్నా ఎన్నికల్లో మాత్రం ఎవరితోనూ పొత్తు లేదు.

1983లో పార్టీ ఆవిర్భావం సమయంలో మేనకా గాంధీ స్థాపించిన సంజయ్ విచార్ మంచ్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 201 స్థానాలు రాగా, మేనకా పార్టీకి ఐదు సీట్లు కేటాయించినా ఒక్కదాంట్లోనూ నెగ్గలేదు. 1985లో బీజేపీ, వామపక్షాలతో తెలుగుదేశం పార్టీ జట్టుకట్టింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 202 సీట్లు గెలుచుకోగా, బీజేపీ తనకు కేటాయించిన 10 సీట్లలో 8 నెగ్గగా, వామపక్షాలు పోటీచేసిన 24 స్థానాల్లో 22 స్థానాల్లో గెలిచాయి. 1989 ఎన్నికల్లో ఇదే పొత్తుతో బరిలో దిగిన టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

ఆ తర్వాత 1994 ఎన్నికల్లో టీడీపీ కేవలం వామపక్షాలతోనే పొత్తు కుదుర్చుకుంది. ఈసారి టీడీపికి 216 సీట్లు రాగా, సీపీఎం, సీపీఐ 34 స్థానాలు దక్కించుకున్నాయి. 1999లో తొలిసారి చంద్రబాబునాయుడు నాయకత్వంలో టీడీపీ ఎన్నికల్లో పోటీపడింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి 185 స్థానాలు రావడంతో బాబు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. 2004లో వైఎస్సార్ హవా కొనసాగిన కాలంలో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేసి పరాజయం పాలైంది.

2009లో మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్, వామపక్షాల సహా అనేక పార్టీలతో కలిసి పోటీచేసినా తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పలేదు. అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ గెలిచింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన చోటుచేసుకుంది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడగా, బీజేపీతో కలిసి తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ విజయం అందుకుని విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో తొలిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కానీ, 2019లో జనసేన రంగప్రవేశంతో త్రిముఖ పోరు అనివార్యమైంది. ఎవరికివారే గెలుపు సమీకరణాలపై నమ్మకంగా ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఒంటరిగా బరిలో దిగేందుకు మొగ్గుచూపాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటిస్తోంది.

More Telugu News