India: నీరవ్ మోదీ సామాన్యుడు కాదు... తప్పించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ ఎత్తుగడ!

  • సింగపూర్ లో శాశ్వత నివాసం కోసం ప్రయత్నం
  • వెనౌటు పౌరసత్వానికి దరఖాస్తు
  • రూపాన్ని మార్చుకునేందుకూ ఆరాటం

విజయ్ మాల్యా బాటలోనే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ఘనుడు నీరవ్ మోదీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను వేలకోట్లలో ముంచేసి లండన్ లో తలదాచుకున్న ఈ డైమండ్ వ్యాపారికి ఎట్టకేలకు అరదండాలు పడ్డాయి. లండన్ లో నీరవ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి రాగానే ఈ వ్యాపారవేత్త దేశం నుంచి చెక్కేశాడు. దాంతో, భారత వర్గాలు అనేక అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలోనే నీరవ్ మోదీపై ఇంటర్ పోల్ వారెంట్ జారీ అయింది. అయితే, 2018 జనవరి నుంచి లండన్ లో నక్కిన ఈ వజ్రాల వ్యాపారి తనపై ఉన్న వారెంట్లు, కేసుల నుంచి తప్పించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు.

బ్రిటన్ లో శాశ్వత ఆశ్రయం పొందేందుకు లీగల్ సేవలు అందించే ప్రముఖ సంస్థలను సంప్రదించడం దగ్గర్నుంచి వెనౌటు అనే చిన్న పసిఫిక్ దీవిలో పౌరసత్వం కోసం ప్రయత్నించడం వరకు ముమ్మరంగా అడ్డదారులు వెతికాడు. ఓ దశలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా పూర్తిగా మార్చుకోవాలని కూడా ఎత్తుగడ వేశాడు. చివరికి సింగపూర్ లో శాశ్వత నివాసం కోసం కూడా విపరీతంగా శ్రమించాడు. కానీ, అవేవీ నెరవేరకముందే బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి ఆశలపై నీళ్లు చల్లారు.

More Telugu News