బ్రిటన్ లోని అత్యంత చెత్త జైలులో నీరవ్ మోదీ!

21-03-2019 Thu 12:44
  • వాండ్స్ వర్త్ జైలులో నీరవ్
  • రోజుకు 22 గంటల పాటు గదిలోంచి బయటకు రానీయరు 
  • కనీస సౌకర్యాలు కరవు
ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కట్టాల్సిన రుణాలను ఎగ్గొట్టి, బ్రిటన్ కు పారిపోయి, బుధవారం నాడు అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ప్రపంచంలోనే అత్యంత చెత్త జైలుగా పేరున్న వాండ్స్ వర్త్ జైలులో ఉంచారు. పీఎన్బీ లోన్ స్కామ్ లో నీరవ్ ప్రధాన నిందితుడన్న సంగతి తెలిసిందే. రూ. 13 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి పారిపోయిన నీరవ్ ను స్కాట్ లాండ్ పోలీసులు కోర్టుకు తరలించగా, బెయిల్ ను ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.

యూకేలో అతిపెద్ద దైన వాండ్స్ వర్త్ జైలులో అధికారులు అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తుంటారు. రోజుకు 22 గంటల పాటు ఇక్కడి ఖైదీలు అత్యంత ఇరుకు గదిలోనే ఉండాల్సి వస్తుంది. ఎంతో మంది ఖైదీలకు నిత్యమూ గాయాలు అవుతుంటాయి. ప్రతి జైలు అధికారి చేతిలో ఉండే ఐరన్ రాడ్డులు ఖైదీలపై నాట్యమాడుతుంటాయి. ఈ జైలులో ఎంతోమంది కరుడుగట్టిన నేరస్తులు, హంతకులు ఉంటారు. ఇక్కడ ఖైదీలకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అటువంటి జైలు ఇప్పుడు నీరవ్ మోదీ తాత్కాలిక నివాసమైంది.