Chandrababu: హైదరాబాద్ లో రోడ్ల పక్కన భోజనాలు పెట్టారు, జనాలు బిచ్చగాళ్లా?: చంద్రబాబు

  • 'అన్న' క్యాంటీన్లు ఏర్పాటుచేశాం
  • నాణ్యమైన భోజనం పెడుతున్నాం
  • ఏలూరు రోడ్ షోలో చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోలింగ్ కు అట్టే సమయం లేకపోవడంతో సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలతో చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పేదలను, కార్మికులను, మధ్యతరగతి కుటుంబీకులను ఆదుకునేందుకు రాష్ట్రంలో 'అన్న' క్యాంటీన్లు పెట్టామని చెప్పారు. ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి క్యాంటీన్లు ఉన్నాయా? అని అడిగారు. హైదరాబాద్ లో రోడ్ల పక్కన భోజనాలు పెట్టారు, జనాలేమైనా బిచ్చగాళ్లా? అంటూ ప్రశ్నించారు. తాము పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని, దేశంలో తిరుగులేని స్థానంలో ఉన్నామని చెప్పారు. తమకు ఈ విషయంలో 720 అవార్డులు వచ్చాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని అవార్డులు రాలేదని చెప్పారు. అయినా మోదీ ఎన్నో అడ్డంకులు సృష్టించాడని, 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా వేయలేదని విమర్శించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీ వాళ్ల సొమ్ముతో డబ్బులు సంపాదిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టకుండా, కనీసం సచివాలయానికి కూడా పోని వ్యక్తి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి వచ్చిందని అన్నారు.

More Telugu News