Vijayawada: ‘నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని, నాకు ఓటెయ్యండి’ అంటే కుదరదు: జగన్ పై బైరెడ్డి సెటైర్లు

  • జగన్ కు ఓటు వేస్తే రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తుంది
  • చంద్రబాబే తిరిగి ముఖ్యమంత్రి కావాలి
  • ఈ రాష్ట్రానికి మరొక్కసారి స్వర్ణయుగం వస్తుంది

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈరోజు కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఎన్నికల్లో పొరపాటున జగన్ కు ఓటు వేస్తే రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తుందని విమర్శించారు. సీఎం కావాలన్న జగన్ కల కలగానే మిగిలిపోవడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కావాలంటే ఓ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని చెప్పారు.

‘నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని, నాకు ఓటెయ్యండి’ అంటే కుదరదని, అలాంటి నాయకుల కొడుకులు చాలా మంది ఉన్నారని, మరి, వాళ్లు కూడా ముఖ్యమంత్రులు కావాల్సి వస్తుందని సెటైర్లు విసిరారు. విభజన తర్వాత పట్టాలు తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలెక్కించిన చంద్రబాబే తిరిగి ముఖ్యమంత్రి కావాలని, అప్పుడే, ఏపీ మరొక్కసారి తలెత్తుకోగలదని, ఈ రాష్ట్రానికి మరొక్కసారి స్వర్ణయుగం వస్తుందని అన్నారు. తాను ఎక్కడున్నా రాయలసీమ హక్కుల కోసం పోరాడతానని చెప్పిన బైరెడ్డి, చంద్రబాబు ఆదేశిస్తే శ్రీశైలం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

More Telugu News