Andhra Pradesh: అందుకే గోరంట్ల మాధవ్ రాజీనామా ఆమోదం పొందకుండా అడ్డుకున్నారు!: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ

  • సునీత వ్యాఖ్యలను వక్రీకరించారు
  • లోకేశ్ మాటలను బాబు నిజం చేస్తున్నారు
  • టీడీపీ కోసం జనసేన డమ్మీలను నిలబెడుతోంది

వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని రాజకీయం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తండ్రి హత్యకేసులో దోషులను శిక్షించడానికి నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని ఆయన కూతురు వైఎస్‌ సునీత ఫిర్యాదు చేస్తే, వక్రీకరణలు చేస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబు అసత్యాలు చెబుతుంటే పోలీసులు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

మంత్రి లోకేశ్‌ పొరపాటుగానో, గ్రహపాటుగానో వివేకా మృతి విషయం తెలిసి ‘పరవశించా!’ అని అన్నారనీ, దాన్ని చంద్రబాబు నిజం చేస్తున్నారని దుయ్యబట్టారు.  హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మ మాట్లాడారు.

వైఎస్ వివేకానందరెడ్డిది రాజకీయ హత్యేననీ, హంతకులు బయటపడకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే హిందూపురం లోక్ సభ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించకపోవడంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో గోరంట్ల మాధవ్ విజయం సాధిస్తారని తెలిసే టీడీపీ కుట్రలకు తెరలేపిందని వ్యాఖ్యానించారు.

అందులో భాగంగానే గోరంట్ల మాధవ్ సీఐ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందకుండా చేశారన్నారు. టీడీపీలో బీసీలకు సీట్లు ఇవ్వరనీ, ఇచ్చినవారికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తారని దుయ్యబట్టారు. వైసీపీని చూస్తే టీడీపీకి గుండెల్లో వణుకు పుడుతోందన్నారు. టీడీపీ అభ్యర్థులు గెలవడానికి జనసేన డమ్మీ అభ్యర్థులను పోటీకి దించుతోందని పద్మ ఆరోపించారు. 

More Telugu News