Andhra Pradesh: మన పోరాటం చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇతర అమ్ముడుపోయిన ఛానళ్లతో కూడా!: వైఎస్ జగన్

  • చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్ధం ఉండదు
  • ఎన్నికల దాకా చంద్రబాబు రోజుకొక సినిమా చూపిస్తారు
  • ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి

ఎన్నికలకు మరో 20 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదనీ, చేయని మోసం ఉండదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రతీ గ్రామానికి డబ్బుల మూటలు పంపుతారనీ, వాటిని ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులే పంచుతారని ఆరోపించారు. ఓటును కొనుగోలు చేసేందుకు ప్రతీఒక్కరి చేతిలో రూ.3,000 పెడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని గ్రామాల్లో ప్రతిఒక్కరికి చెప్పాల్సిందిగా సభికులను కోరారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

వైసీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ఈ సందర్భంగా జగన్ వివరించారు. ‘ఎన్నికల నాటి వరకూ పొదుపు సంఘాల మహిళలకు ఎంత అప్పు ఉంటే అంత సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అన్న ఇస్తాడని చెప్పండి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద ప్రతి ఏటా రూ.75,000 నాలుగు దఫాల్లో ఇస్తామని చెప్పండి.

సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే ఆ రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందామని, లక్షాధికారులం అవుదామని చెప్పండి. పెట్టుబడి సాయం ప్రతి రైతన్నకు ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 ఇస్తాడనీ, అలాగే పెన్షన్‌ను రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు వివరించండి’ అని కోరారు.

ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలపై కూడా జగన్ విరుచుకుపడ్డారు. ‘మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు. చంద్రబాబుకు తానతందాన అనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన టీవీ చానళ్లన్నింటితోనూ. వీళ్లంతా కలిసి ఎన్నికల దాకా ప్రజలకు రోజుకొక సినిమా చూపిస్తారు.

ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. గుండెలపై చేయివేసుకుని ఆలోచించమని కోరుతున్నా. కొండెపి నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ మాదాసి వెంకయ్య, ఒంగోలు ఎంపీ అభ్యర్థి  మాగుంట శ్రీనివాసుల రెడ్డిలకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైసీపీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని భారీ మెజారిటీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

More Telugu News