Andhra Pradesh: గుంటూరు టీడీపీలో అసమ్మతి సెగ.. సీఎం ఇంటి ముందు చలమారెడ్డి గ్రూపు ఆందోళన!

  • మాచర్ల టికెట్ దక్కించుకున్న అంజిరెడ్డి
  • ఆయన పేరు గూగుల్ లోనూ లేదన్న ఆందోళనకారులు
  • పోటీచేస్తే 25,000 ఓట్ల తేడాతో ఓడిపోతాడని వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు టికెట్లు ప్రకటించడంతో అసమ్మతి నేతలు ఆందోళనకు దిగుతున్నారు. అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీకి ఈ ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మాచర్ల టికెట్ ను చలమారెడ్డికి కాకుండా అంజిరెడ్డికి కేటాయించడంపై చలమారెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందుకు చేరుకుని ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా ‘అంజిరెడ్డి వద్దు.. చలమారెడ్డి ముద్దు’ ‘అంజి రెడ్డి డౌన్ డౌన్’ అని నినాదాలు చేశారు. కాగా, ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎదుర్కోవాలంటే చలమారెడ్డే సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అంజిరెడ్డి పోటీచేస్తే 25,000 ఓట్ల తేడాతో ఓడిపోతారని హెచ్చరించారు.

అంజిరెడ్డి పేరును కొడితే గూగుల్ కూడా చూపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన ఎవరో తెలియదని ఇక్కడి లోక్ సభ అభ్యర్థి కూడా చెబుతున్నారనీ, కాబట్టి చంద్రబాబు అంజిరెడ్డిని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే మాచర్ల స్థానాన్ని అప్పనంగా వైసీపీకి ఇచ్చినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చలమారెడ్డికి న్యాయం జరిగే వరకూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు.

More Telugu News