Telugudesam: వారసులు వచ్చేస్తున్నారు... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలబడింది వీరే!

  • తెలుగుదేశంలో వారసుల హవా
  • 20 మందికి పైగా వారసులకు చాన్స్
  • బరిలో ప్రముఖ కుటుంబాల వారసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా సీనియర్ నేతల వారసుల హవా అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న వారసులు అధికంగా కనిపిస్తున్నారు. కొత్తగా బరిలో నిలుస్తున్న వారిలో అందరికీ ప్రముఖంగా కనిపిస్తున్నది సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశే. ఆయన మంగళగిరి నుంచి పోటీలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. తొలిసారి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఆయనతో పాటు కేఈ కృష్ణమూర్తి, పరిటాల సునీత, బొజ్జల గోపాలకృష్ణ, కిమిడి కుటుంబాల నుంచి వారసులు రంగంలోకి దిగారు.

అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు కుమారుడు, మంత్రి కిడారి శ్రావణ్ సైతం తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు. రాజమండ్రి అర్బన్ నుంచి ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని పోటీ చేస్తున్నారు. గుడివాడ నుంచి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ పోటీలో ఉన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె షబానా, పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్, రాప్తాడు నుంచి పరిటాల వారసుడు శ్రీరామ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు.

వీరితో పాటు శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వారసుడిగా సుధీర్ రెడ్డి, నగరి నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను, పెడన నుంచి కాగిత వెంకట్రావు కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్, కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ తనయుడు హరికృష్ణ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

More Telugu News