Maoist: పద్నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత.. నిర్దోషిగా విడుదలైన మావోయిస్టు ఉగ్గె చంద్రమౌళి

  • 2005లో అప్పటి మధ్యప్రదేశ్ మంత్రి హత్య 
  • ప్రధాన నిందితుడిగా చంద్రమౌళి
  • నిర్దోషిగా నేడు స్వగ్రామానికి రాక

పద్నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా విడుదలైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి అలియాస్‌ మదన్‌లాల్‌, అలియాస్‌ సీఎం నేడు స్వగ్రామమైన వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యాపూర్‌కు రానున్నారు. 2005లో మధ్యప్రదేశ్‌లో అప్పటి రవాణాశాఖ మంత్రి లఖిరామ్ కావ్రే హత్యకు గురయ్యారు.

 ఈ కేసులో ప్రధాన నిందితుడైన చంద్రమౌళి అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆగస్టు 14, 2015లో బాలగఢ్‌ జిల్లా కోర్టు చంద్రమౌళికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. బాలగఢ్ కోర్టు విధించిన శిక్షను చంద్రమౌళి  జబల్‌పూర్‌ కోర్టులో సవాలు చేశారు. కేసును విచారించిన కోర్టు.. చంద్రమౌళిని నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది.

1981లో మావోయిస్టు పార్టీలో చేరిన చంద్రమౌళి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో పనిచేశారు. మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు హత్య కేసులో నిందితుడైన ఆయనపై నాలుగు రాష్ట్రాల్లో 35కుపైగా కేసులున్నాయి. 14 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన ఆయన నేడు నిర్దోషిగా స్వగ్రామానికి రావడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News