Jagan: పోలవరం వైఎస్ఆర్ దే... పూర్తి చేసేది నేనే: వైఎస్ జగన్

  • ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్
  • చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు
  • బాబు కథలు విని మోసపోవద్దు
  • కొయ్యలగూడెంలో వైఎస్ జగన్

పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసేది తానేనని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, చంద్రబాబు చెప్పే పోలవరం కథలను విని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ ప్రాజెక్టు తన తండ్రి కలని, దాన్ని ఆలస్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. నాలుగేళ్ల క్రితం పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేసిన ఆయన, ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కాలేదని, నిరాశ్రయులకు, బాధితులకు పరిహారం ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నత్తనడకన పనులు సాగడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు.

చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ప్రజలకు రేషన్ కార్డుల నుంచి పెన్షన్ల వరకూ ప్రతి పనికీ జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన దుస్థితిలో ప్రజలు ఉన్నారని, ఈ ఇబ్బందులన్నీ తాను విన్నానని, ప్రజల సమస్యలు తాను చూశానని, వారికి సంక్షేమ పాలనను అందించేందుకు తానున్నానని భరోసాను ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న 50 శాతం అక్క చెల్లెమ్మల కష్టాలు తనకు తెలుసునని, వారందరి సమస్యలనూ తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీ అవాస్తవమని వైఎస్ జగన్ ఆరోపించారు. రుణ మాఫీ జరుగకుండానే సిగ్గులేకుండా, వాటిని మాఫీ చేశానని చెబుతూ శాలువాలు కప్పించుకున్న ఘనత ఆయనదేనని అన్నారు.

ఎన్నికలకు మూడు నెలల ముందు వచ్చి ఆయన చెక్కులు ఇస్తున్నారని, ఆ మొత్తం కలిపినా రూ. 6 వేల కోట్లు దాటలేదని, అవి కూడా బ్యాంకుల్లో మారడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. అక్కచెల్లెమ్మలు పడిన బాధలు తనకు తెలుసునని, వారికి ఓ అన్నగా అండగా నిలుస్తానని అన్నారు. వైకాపా ప్రభుత్వం రాగానే అప్పుల పాలైన అక్కచెల్లెమ్మల కష్టాలన్నింటినీ తాను తీరుస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే నాలుగేళ్లలో సంవత్సరానికి రూ. 12,500 చొప్పున రూ. 50 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.

More Telugu News