Khammam District: ఖమ్మంలో టీడీపీకి షాక్‌... టీఆర్ఎస్ లో చేరనున్న నామా నాగేశ్వరరావు

  • ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం
  • తెలుగుదేశం పార్టీలో బలమైన నేతలపై టీఆర్‌ఎస్‌ దృష్టి
  • లోక్‌సభ సీటు కేటాయించే అవకాశం

ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్‌. పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సైకిల్‌ దిగి కారెక్కనున్నారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ను ఖాళీ చేయించింది. తాజాగా టీడీపీపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలోని అక్కడక్కడా ఉన్న బలమైన నేతలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే నామాకు ఆహ్వానమని, ఆయన త్వరలోనే కారెక్కనున్నారని సమాచారం. సోమవారం నామా నాగేశ్వరరావు ఫాంహౌస్‌కు వెళ్లి తన చేరికపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

నామా రాక ఖరారు కావడంతో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి ఆయనను పోటీకి దింపే యోచనలో టీఆర్‌ఎస్‌ ఉందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి నామా నాగేశ్వరరావు పోటీచేసి ఓడిపోయారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అనంతరం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్టు ఇవ్వకూడదని గులాబీ దళపతి నిర్ణయించినందునే, ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారని సమాచారం.

More Telugu News