Goa: అర్ధరాత్రి 2 గంటలకు గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రమోద్ సావంత్!

  • స్వయంగా రంగంలోకి దిగిన అమిత్ షా
  • ఇద్దరికి డిప్యూటీ పదవులు
  • చల్లారిపోయిన అసమ్మతి

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్థానాన్ని ప్రమోద్ సావంత్ భర్తీ చేశారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో గోవా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం సాయంత్రం పారికర్ మరణించగా, సోమవారం సాయంత్రం అంత్యక్రియలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బీజేపీ పావులు కదిపింది. కీలకమైన భాగస్వామ్య పార్టీలతో చర్చలు సాగించినా ఫలితం లేకపోవడంతో అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు.

ఇద్దరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులిస్తామని ఆయన చెప్పడంతో అసమ్మతి ఒక్కసారిగా చల్లారిపోయింది. ఆ వెంటనే ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం ఖరారైపోయింది. ఆయన క్యాబినెట్ లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సహా 12 మంది మంత్రులకు స్థానం లభించింది. ఎంజీపీకి చెందిన సుదిన్ ధావలికర్, గోవా ఫార్వార్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ లకు డిప్యూటీ సీఎం పదవులు లభించాయి. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రమోద్ మాట్లాడుతూ "నేను మనోహర్ పారికర్ మాదిరిగా పరిపాలించలేను. అయితే, సుపరిపాలన అందించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను" అన్నారు.

More Telugu News