KTR: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకోవచ్చు... చంద్రబాబు ప్రచారం చేస్తే అడ్డుకున్నామా?: కేటీఆర్

  • జనసేన తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టుకోవచ్చు
  • ఐదేళ్లలో చంద్రబాబు చేసింది ఏమీలేదు
  • చేసింది చెప్పుకోలేక మాపై పడి ఏడుస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలపైనా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ వర్గాలకు, ఆయనకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. పనిలోపనిగా పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్తావనలోకి తీసుకువచ్చారు.

లోక్ సభ ఎన్నికల కోసం జనసేన పార్టీ తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టుకోవచ్చని, ఎవరూ అడ్డుపడరని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా నిరభ్యంతరంగా తెలంగాణలో తన పార్టీ కోసం ప్రచారం చేసుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేస్తుంటే మేమేమైనా అడ్డుకున్నామా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన గురించి చెప్పుకోలేకపోతున్నారని, చేసింది చెప్పుకోలేక తమపై పడి ఏడుస్తున్నారంటూ విమర్శించారు.

ఏపీ రాజకీయాల్లో తమ పాత్ర ఏమీ ఉండదని, అయితే ఏప్రిల్ 11 తర్వాత తాము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా? లేదా? అనేది తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఇమేజ్ పాతాళంలో ఉందని, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టిందిపేరని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కొన్ని జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News