Lok Sabha: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసినా సంపూర్ణ మెజార్టీ రాదు: కేటీఆర్ సెటైర్లు

  • దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయింది
  • ఎన్డీఏకు 150 కంటే ఎక్కువ సీట్లు రావు
  • కాంగ్రెస్ కు 100 స్థానాలు దాటవు

త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసినా కూడా సంపూర్ణ మెజార్టీ రాదని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు విసిరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయిందని, ఎన్డీఏకు 150 కంటే ఎక్కువ సీట్లు రావని, కాంగ్రెస్ కు 100 స్థానాలు దాటవని జోస్యం చెప్పారు.

ఎవరు రైల్వే మంత్రిగా ఉంటే ఆ రాష్ట్రానికే కొత్త రైల్వే లైన్లు వస్తాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా రాదా? అని ప్రశ్నించారు. 16 ఎంపీ స్థానాల్లో గులాబీ జెండానే ఎగరాలని, ఢిల్లీలో యాచించే పరిస్థితి కాకుండా శాసించే స్థితిలో మనం ఉండాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందని, సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశంలోని లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని అన్నారు.

More Telugu News