Manohar parrikar: రక్షణ మంత్రిగా కొల్హాపురి చెప్పులు.. పారికర్ సింప్లిసిటీకి ఇదో ఉదాహరణ

  • ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన సేవలు అమోఘం
  • హైప్రొఫైల్‌లో ఉంటూనే సాధారణ వస్త్రధారణ
  • పాశ్చాత్య వస్త్రధారణ తనకు సరిపోదని వ్యాఖ్య

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సింప్లిసిటీకి అద్దం పట్టే ఘటన ఇది. 63 ఏళ్ల పారికర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కేంద్రమంత్రిగా మిగతా వారితో పోలిస్తే ఆయనది ప్రత్యేక శైలి. ఆడంబరాలకు దూరంగా ఉండే ఆయన ఓ సాధారణ వ్యక్తిగా ఉండేందుకు మాత్రమే ఇష్టపడేవారు.

రక్షణ మంత్రిగా అత్యంత ఉన్నత పదవిలో ఉండి కూడా కాళ్లకు కొల్లాపూర్ చెప్పులు ధరించేవారు. ఓసారి ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌ అడిగిన ప్రశ్నకు చెబుతూ, రక్షణ మంత్రిగా ఉంటూ కొల్హాపూర్ చెప్పులు ధరించడం కొంత ఇబ్బందిగానే ఉందని అన్నారు. పాశ్చాత్య వస్త్రధారణ తనకు నప్పదని, ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. అయితే, గత రక్షణ మంత్రుల కంటే తన వస్త్రధారణ బాగానే ఉంటుందని పేర్కొన్నారు.

ఆరెస్సెస్ ప్రచారక్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పారికర్ రక్షణ మంత్రిగా, గోవా ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించారు. గోవాకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, మూడేళ్లకు పైగా దేశ రక్షణ మంత్రిగా పనిచేశారు. పారికర్‌ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకోవడం విశేషం. బీజేపీతో సంబంధం లేకుండా ఆయనను ప్రజలు ఆదరించడం ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యక్ష నిదర్శనం.

More Telugu News