Manohar Parrikar: అత్యంత విషమంగా పారికర్ ఆరోగ్యం... గోవాకు బయలుదేరిన బీజేపీ నేతలు!

  • రాజకీయ పరిస్థితులను అంచనా వేయనున్న నేతలు
  • పాలనకు ఇబ్బందేమీ లేదన్న మంత్రి నీలేష్
  • పారికరే తమ నాయకుడన్న గోవా బీజేపీ

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ పెద్దలు గోవాకు బయలుదేరారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేసేందుకు ఇద్దరు పరిశీలకులను బీజేపీ పంపింది. అందరు ప్రజాప్రతినిధులూ రాష్ట్రంలోనే ఉండాలని ఆదేశించింది. పారికర్ ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆయనే తమ నాయకుడని గోవా బీజేపీ యూనిట్ స్పష్టం చేసింది.

ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని, పాలన సజావుగా సాగుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నీలేష్ కాబ్రాల్ వ్యాఖ్యానించారు. పారికర్ నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్, వెంటనే అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం 40 సీట్లున్న గోవా అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఫ్రాన్సిస్ డిసౌజా మరణంతో 37 మంది ఎమ్మెల్యేలుండగా, మెజారిటీ ఉండాలంటే 19 మంది ఎమ్మెల్యేల అవసరముంది. ప్రస్తుతం బీజేపీకి 13 మంది ఎమ్మెల్యేల బలముండగా, గోవా ఫార్వార్డ్ పార్టీ, ఎంజీపీ, ఎన్సీపీల నుంచి ఒక్కొక్కరు, మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నారు.

More Telugu News