srikaku: మళ్లీ మన ప్రభుత్వం రావడం నూటికి వెయ్యి శాతం గ్యారంటీ: సీఎం చంద్రబాబు ధీమా

  • ఇరవై ఐదింటికి ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో గెలిపించాలి
  • అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 150+ స్థానాలు దక్కాలి
  • ముగ్గురు మోదీలు ఏం చేయలేరు

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఐదింటికి ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. శ్రీకాకుళంలో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ఏపీలోని అన్ని ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీకి దిగుతున్న టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని,   అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 150+ స్థానాల్లో విజయం సాధించి పెట్టాలని కోరారు. త్వరలో జరగబోయే ఎన్నికలు వన్ సైడ్ ఎన్నికలు కావాలని, టీడీపీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.  

తన నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 50 వేల మెజార్టీకి తక్కువ రాదని, మరి, మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు రాదని అన్నారు. తన నియోజకవర్గంలో కంటే ఎక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. ఏ నియోజకవర్గంలో ఎంత ఎక్కువ మెజార్టీ వస్తుందో ఆ నియోజకవర్గం కార్యకర్తలను, నాయకులకు రాబోయే రోజుల్లో అంత గౌరవిస్తానని అన్నారు.

ప్రతి ఒక్క నియోజకవర్గానికి పోటీ పెడుతున్నానని, జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఎక్కువ మెజార్టీ వస్తుందో, వాళ్లకు ఎక్కువ పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ఏ ఏరియాలో ఎక్కువ మెజార్టీ వస్తుందో, ఆ నాయకుడిని గౌరవిస్తానని, వారికి పదవులు ఇస్తానని, ఏ బూత్ లో ఎక్కువ ఓట్లు వస్తే ఆ బూత్ పై ఎక్కువ శ్రద్ధ పెడతానని అన్నారు. మొదటి ఎన్నికల్లో అందరికీ సమానంగా పనులు చేశానని, రెండో ఎన్నికల్లో ఒకరికి ఒకరు పోటీ పడాలని మంచి  మెజార్టీ రావాలని అన్నారు.

మళ్లీ మన ప్రభుత్వం రావడం నూటికి వెయ్యి శాతం గ్యారంటీ అని, దీన్ని ఎవ్వరూ ఆపలేరని  చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ముగ్గురు మోదీలు ఇక్కడ ఏం చేయలేరని ప్రజలందరూ గట్టిగా సమాధానం చెప్పాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. శవరాజకీయాలు చేస్తున్న వ్యక్తికి సపోర్టు చేస్తే ఏమవుతుందో తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని అన్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? మన విరోధి బలహీనంగా ఉన్నా, యుద్ధం బలంగా చేయాలి. ఘన విజయం రావాలి. మనం గెలుస్తున్నాం, దాంట్లో, అనుమానం లేదు’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News