Pawan Kalyan: తన ఓటు బదిలీ విషయంలో పవన్ కల్యాణ్ కు ఊహించని సమాధానం చెప్పిన కలెక్టర్

  • పార్టీ అధ్యక్షుడికే ఇలాంటి పరిస్థితా!
  • సామాన్యుడి సంగతేంటి?
  • అసహనం వ్యక్తంచేసిన జనసేనాని

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఇటీవలే పవన్ కల్యాణ్ తన పేరిట రెండు ఓట్లు ఉండడంతో వాటిలో ఒకటి తొలగించాలని దరఖాస్తు చేసుకున్నారు. అంతేగాకుండా, ఏలూరులో ఉన్న ఓటును విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి బదిలీ చేయాలని కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే, పవన్ కల్యాణ్ అధికారుల నుంచి వచ్చిన సమాధానంతో అసహనానికి గురయ్యారు. మొదట ఆయన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు నమోదు చేయించుకున్నారు.

ఆ తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గానికి తన ఓటును బదిలీ చేయించుకోవాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. పవన్ విజ్ఞప్తి మేరకు ఓటును విజయవాడ బదిలీ చేశారు. కానీ ఏలూరులో ఉన్న ఓటును మాత్రం అలాగే ఉంచారు. దాంతో పవన్ కు రెండు ఓట్లు ఉన్నట్టయింది. రెండు చోట్ల ఓటర్ల జాబితాలో పవన్ కల్యాణ్ పేరు కనిపిస్తోంది. ఈ విషయమై ఎన్నికల అధికారికి పవన్ విజ్ఞప్తి చేయగా, ఆయన జిల్లా కలెక్టర్ కు విషయం చెప్పారు. అయితే, సర్వర్ పనిచేయడం లేదని, అందుకే మీ ఓటు బదిలీ చేయలేకపోతున్నామంటూ కలెక్టర్ సమాధానమిచ్చారు. దాంతో పవన్ కల్యాణ్, ఓ పార్టీకి అధ్యక్షుడ్నయిన తనకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు.  

More Telugu News