YSRCP: ఇది వైఎస్ వివేకా ఎంపీ పదవికి రాజీనామా చేసిన నాటి సంఘటన.. అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు!

  • నేను, సాయి ప్రతాప్ సెంట్రల్ హాల్ లో ఉన్నాం
  • అప్పుడు, సోనియా నుంచి ప్రతాప్ కు ఫోనొచ్చింది
  • రిజైన్ చేసి వెళ్లిపోతున్న వివేకాను తీసుకురమ్మని చెప్పారు

నాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామా చేయడం వెనుక వైఎస్ జగన్ తీవ్ర ఒత్తిడి ఉందంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వివేకానందరెడ్డి చాలా సౌమ్యుడని, మంచి వ్యక్తి అని అన్నారు. నాడు వివేకా తన పదవికి రాజీనామా చేసిన సంఘటన గురించి వివరించి చెప్పారు.

‘2006 ఆ ప్రాంతంలో నేను తొలిసారిగా ఎంపీ అయ్యాను. వైఎస్ వివేకానందరెడ్డి గారు కూడా ఎంపీ. అప్పుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికి సాయిప్రతాప్ మంత్రి అవలేదనుకుంటా.  మేమంతా సెంట్రల్ హాల్ లో కూర్చున్నాం. ఈవినింగ్  నాలుగు గంటల ప్రాంతంలో మేము టీ తాగుతున్నాం. సడెన్ గా మేడమ్ (సోనియా) దగ్గర నుంచి సాయి ప్రతాప్ గారికి ఫోన్ వచ్చింది. వివేకానందరెడ్డి గారు రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు, ఆయన్ని తీసుకురమ్మని ఆమె ఆదేశించింది. అప్పుడు, సాయి ప్రతాప్ గారితో పాటు ఇద్దరు ముగ్గురు ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. వెళ్లి ఆయన్ని(వివేకానందరెడ్డి) తీసుకువచ్చారు.


‘ఎందుకు రిజైన్ చేశారు? అని ఆయన్ని మేడమ్ అడిగితే, ‘ఇంట్లో బాగా ప్రెషర్ ఉందండి’ అని చెప్పారు. మా నాయన టికెట్ ఇది. ఇంకా నువ్వెందుకు ఉంటున్నావు? అని నా మీద చేయి చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందండి.. కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను. ఇంకా, నేను ఉండను మేడమ్’ అని (వివేకానందరెడ్డి) ఆయన చెప్పారు. ఇది మనకు అక్కడ తెలిసిన విషయం.

వెంటనే, మేడమ్, రాజశేఖరరెడ్డి గారికి ఫోన్ చేసి ‘ఇది మంచి పద్ధతి కాదు.  మీ అబ్బాయికి ఇంకా చాలా టైముంది కదా .. నెక్స్ట్ టైమ్ చేయొచ్చు కదా, ఇలాగ చేస్తే, బై ఎలక్షన్స్ లో నేను టికెట్ కూడా ఇవ్వను’ అని ఆమె అన్నారు.
 
‘ఈ విషయం నాకు తెలియదమ్మ.. నేను కంట్రోల్ చేస్తాను, అట్లాంటిది ఇంక జరగదు’ అని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నాకు తెలుసు. వివేకానందరెడ్డి గారు చాలా సౌమ్యుడు. అలాంటి వ్యక్తి చాలా అవమానాలకు గురైనట్టుగానే ఆఫ్ ద రికార్డ్ చెబుతూనే ఉన్నాయి. క్లోజ్డ్ సర్కిల్ లో చెబుతుండే వారు. అప్పుడే, అనుకున్నాం.. ‘రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి చాలా స్పీడ్ గా ఉంటాడు’ అని. అంతేగానీ, అప్పటికి జగన్ గారి గురించి మాకు పెద్దగా తెలియదు’ అని చెప్పుకొచ్చారు.

కాగా, టీడీపీలో హర్షకుమార్ చేరనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై ఆయన చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చకు దారితీయడం గమనార్హం.

More Telugu News