జమ్మూ కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి

16-03-2019 Sat 19:07
  • 15 మందితో రాజ్‌గఢ్ వెళుతున్న వాహనం
  • మూలమలుపు వద్ద అదుపు తప్పిన వైనం
  • సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. 15 మంది ప్రయాణికులతో చందర్ కోట్ నుంచి రాజ్‌గఢ్ వెళుతున్న ఓ ఎస్‌యూవీ కుందా నల్లా ప్రాంతంలో మూలమలుపు వద్దకు రాగానే అదుపు తప్పింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం ఒక్కసారిగా రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న 500 అడుగుల లోయలో పడిపోయింది.

స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్ముకు తరలించారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందునే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.