slovenia: ఇన్సూరెన్స్ డబ్బులకు ఆశపడి.. రంపంతో చేతిని నరికేసుకున్న యువతి!

  • స్లొవేనియాలోని లియూబ్లియానాలో ఘటన
  • యువతి పేరుపై రూ.3.14 కోట్ల ఇన్సూరెన్స్
  • శాశ్వత అంగవైకల్యం వస్తే నెలకు రూ.2 లక్షల పరిహారం

పేదరికం కారణంగా ఓ యువతి తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. తన పేరుపై ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము అందుకోవడానికి ఏకంగా చెట్లను కోసే రంపంతో తనచేయిని తానే నరుక్కుంది. ఈ వ్యవహారంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. చివరికి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఇన్సూరెన్స్ సొమ్ముకోసమే ఈ పని చేసినట్లు అంగీకరించారు. దీంతో వీరందరిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన స్లొవేనియాలో చోటుచేసుకుంది.

స్లోవేనియాలోని లియూబ్లియానాకు చెందిన ఓ యువతి(21) తన పేరుపై రూ.3.14 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. అయితే, కొన్నాళ్లకు ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం బీమాదారుడికి శాశ్వత వైకల్యం సంభవిస్తే, నెలకు రూ.2.13 లక్షల నగదు జీవితాంతం లభిస్తుంది. ఈ నేపథ్యంలో చెట్లను కోసే ఎలక్ట్రిక్ రంపంతో యువతి తన చేయిని కోసుకుంది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు ఏమీ తెలియనట్లు యువతిని ఆసుపత్రికి తీసుకొచ్చారు.

తొలుత రక్తస్రావాన్ని నిలువరించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఏమయిందని యువతిని ప్రశ్నించగా, చెట్టు కొమ్మలను కోస్తుండగా ప్రమాదం జరిగిందని యువతి జవాబిచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు యువతి తల్లిదండ్రులు నీళ్లునమిలారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ పని చేసినట్లు అంగీకరించారు.

దీంతో ఇంటివద్ద యువతి తెగిపడ్డ చేతిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే ఆపరేషన్ ప్రారంభించిన వైద్యులు చేతిని శస్త్ర చికిత్స ద్వారా అతికించారు. కాగా, బాధితురాలితో పాటు నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ నేరం కోర్టులో రుజువైతే ఒక్కొక్కరికి  8 సంవత్సరాల జైలుశిక్ష పడుతుంది.

More Telugu News