Karnataka: మండ్యా నుంచి పోటీకే సుమలత మొగ్గు...బీజేపీ నేత ఎస్‌.ఎం.కృష్ణతో భేటీ

  • భర్త వారసత్వాన్ని కొనసాగించాలని సినీనటి నిర్ణయం
  • కాంగ్రెస్‌ టికెట్టు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో
  • బీజేపీ వైపు కూడా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం

రాజకీయాల్లో ఇంకా ఓనమాలు దిద్దుతున్న సినీనటి సుమలత కాంగ్రెస్‌ పార్టీకి చిన్న షాకిచ్చారు. తన భర్త అంబరీష్‌కు అనుబంధం ఉన్న మండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్‌ టికెట్టు ఇచ్చే అవకాశం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం బీజేపీ సీనియర్‌ నేత ఎస్‌.ఎం.కృష్ణను కలిసి చర్చకు తెరలేపారు.

సుమలత భర్త, రెబల్‌స్టార్‌ అంబరీష్‌ కొన్ని నెలల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని మండ్యా లోక్‌సభ నియోజకవర్గంతో అంబరీష్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన కాంగ్రెస్‌ నాయకునిగా కొనసాగారు. అంబరీష్‌ మరణం తర్వాత రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని సుమలత ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం మండ్యా లోక్‌సభ స్థానం జేడీ(ఎస్‌) చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో  కాంగ్రెస్‌ టికెట్టు ఇస్తుందని ఆశించారు. కానీ ఆ అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంలో అడుగు వేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ నేత కృష్ణతో భేటీ అయ్యారని సమాచారం. సదాశివనగర్‌లోని కృష్ణ ఇంటికి వెళ్లిన సుమలత దాదాపు అరగంటకు పైగా ఆయనతో మంతనాలు జరిపారు. మండ్యలో తన తరపున ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరినట్లు సమాచారం.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త వారసత్వాన్ని కొనసాగించాలని అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని, అందుకే కాంగ్రెస్‌ నుంచి టికెట్టు ఆశించానని తెలిపారు. అయితే ఆ అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయం దిశగా అడుగు వేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 18న తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని, ఈలోగా తన రాజకీయ గురువు ఎస్.ఎం. కృష్ణ ఆశీర్వాదం కోసం వచ్చినట్లు తెలిపారు.

సుమలత భేటీపై కృష్ణ మీడియాతో మాట్లాడుతూ మండ్యాలో తనకు మద్దతు ఇవ్వాలని సుమలత కోరారని తెలిపారు. తాను బీజేపీ అభ్యర్థులను గెలిపించి మరోసారి మోదీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

More Telugu News