జగన్‌కు తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటే: ఆదినారాయణరెడ్డి

15-03-2019 Fri 19:26
  • మరణవార్త తెలియగానే వివేకా ఇంటికెళ్లా
  • త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయి
  • రాజకీయలబ్ధి కోసం ఆరోపణలు సరికాదు

వైఎస్ వివేకానందరెడ్డి మృతి బాధాకరమని.. ఆయన మరణవార్త తెలియగానే వాళ్ల ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపినట్టు మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. వివేకా మరణంలో చంద్రబాబు, లోకేశ్, ఆదినారాయణరెడ్డి, సతీశ్‌రెడ్డి హస్తముందని వైఎస్ బావమరిది, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆదినారాయణరెడ్డి స్పందించారు.

నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకా మృతి విషయంలో త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని, అవి తెలియకముందే రాజకీయ లబ్ధి కోసం రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్‌కు కూడా తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటేనన్నారు. తప్పు చేసిన వారిని ఉరి తీసినా తప్పులేదని.. వివేకా మృతిపై లోతైన దర్యాప్తు జరపాలన్నారు.