Australia: 37 పేజీల మేనిఫెస్టో రాసుకున్న న్యూజిలాండ్ కాల్పుల నిందితుడు బ్రెంటన్ టరాంట్

  • టరాంట్ ను అతివాదిగా పేర్కొన్న ఆస్ట్రేలియా ప్రధాని
  • 28 ఏళ్ల వయసుకే కరుడుగట్టిన వైనం
  • ద గ్రేట్ రీప్లేస్ మెంట్ పేరుతో మేనిఫెస్టో

న్యూజిలాండ్ లో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న వ్యక్తులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడిన దుండగుడిని బ్రెంటన్ టరాంట్ గా గుర్తించారు. క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల్లో శుక్రవారం సందర్భంగా పవిత్ర ప్రార్థనలు చేసుకుంటున్న ప్రజలపై ఒక్కసారిగా కాల్పులు జరగడంతో 49 మంది మరణించడం తెలిసిందే. కాల్పులు జరిపింది ఒక్కరే అయినా అతడికి మరో ముగ్గురు సహకరించినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు కాల్పులకు పాల్పడిన బ్రెంటన్ టరాంట్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ కారులో పెద్ద ఎత్తున రైఫిళ్లు, పేలుడు పదార్థాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఇక, ప్రధాన నిందితుడు బ్రెంటన్ టరాంట్ విషయానికొస్తే అతడు తమ దేశానికి చెందినవాడేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. టరాంట్ ఓ సామాజిక అతివాది అని పేర్కొన్నారు మారిసన్. కాగా, టరాంట్ దాడులపై 'ద గ్రేట్ రీప్లేస్ మెంట్' పేరుతో37 పేజీల మేనిఫెస్టో రాసుకున్నాడు. ఆ సందేశాన్ని ఓ వెబ్ సైట్ లో పోస్టు చేశాడు. దాంట్లో, తనను తాను ఓ సాధారణ శ్వేత జాతీయుడిగా పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాలో పుట్టిన 28 ఏళ్ల యువకుడ్నని, పేద కుటుంబానికి చెందినవాడ్నని తెలిపాడు. విదేశీ చొరబాటుదార్ల కారణంగా చోటుచేసుకుంటున్న వేలాది చావులకు ప్రతీకారంగానే ఈ కాల్పులు జరిపినట్టు వెల్లడించాడు. రెండేళ్ల ముందే దాడులకు ప్రణాళిక రచించానని, అయితే ఎక్కడ దాడి చేయాలన్నది మాత్రం మూడునెలల క్రితం నిర్ణయించుకున్నట్టు బ్రెంటన్ వివరించాడు. అంతేకాదు, తనను తాను కమ్యూనిస్ట్ గా, ఆపై అరాచకవాదిగా పేర్కొన్న ఈ ఆస్ట్రేలియన్ చివరిగా సామాజిక త్యాగశీలిగా మారడానికి ముందు స్వేచ్ఛావాదిగా ఉన్నానని పేర్కొన్నాడు.

More Telugu News